TDP: టీడీపీలో చేరేందుకు హైదరాబాద్ పయనమైన వైసీపీ నేత.. ఓఆర్ఆర్‌పై కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు!
- పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో టీడీపీలో చేరాలని గాదె వెంకట్‌రెడ్డి నిర్ణయం
- ఔటర్ రింగురోడ్డుపై కిడ్నాప్ చేసి వెంట తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
- వైసీపీ వాళ్లే చేయించారంటున్న టీడీపీ నేత జీవీ ఆంజనేయులు
టీడీపీలో చేరేందుకు హైదరాబాద్ బయలుదేరిన వైసీపీ నేతను గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని తమ కారులో ఎక్కించుకుని వెళ్లిన ఘటన హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై జరిగింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని చండ్రాజుపాలేనికి చెందిన వైసీపీ నేత గాదె వెంకటరెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తన అనుచరులతో కలిసి నిన్న ఉదయం హైదరాబాద్‌లోని ఎన్డీఆర్ భవన్‌కు బయలుదేరారు. ముందు ఆయన వాహనంలో వెళ్తుండగా, మరో వందమంది ఆయన అనుచరులు ఏడెనిమిది వాహనాల్లో బయలుదేరారు.
అయితే, వారు మిర్యాలగూడ చేరుకునే సరికి గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు బ్రిడ్జిపై వెంకటరెడ్డిని కిడ్నాప్ చేసి తమ కారులో తీసుకెళ్లినట్టు తెలియడంతో చేసేది లేక వారంతా వెనక్కి వెళ్లిపోయారు. విషయం తెలిసిన వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే, సాయంత్రం ఏడు గంటల సమయంలో తాను హైదరాబాద్‌లో క్షేమంగానే ఉన్నానని, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చండ్రాజుపాలెం మాజీ సర్పంచ్ అయిన వెంకటరెడ్డి గత ఎన్నికల్లో పెదకూరపాడులో వైసీపీ గెలుపునకు విశేషంగా కృషి చేశారు. అయితే, గత కొంతకాలంగా పార్టీ తనను పట్టించుకోవడం లేదని, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని మనస్తాపం చెందిన ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో నిన్న ఆయన హైదరాబాద్ బయలుదేరారు. అయితే, అనూహ్యంగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అడ్డుకుని పార్టీలో చేరకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు. కాగా, ఈ ఘటనపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలే ఈ పని చేశారని నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు.