Mumbai Indians: ఐపీఎల్ 2020 విజేత ముంబయి ఇండియన్స్... ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి
- 5 వికెట్ల తేడాతో ముంబయి విక్టరీ
- మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 రన్స్
- 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసిన ముంబయి
- రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్
ఐపీఎల్ ఫైనల్లో ఎలాంటి సంచలనం నమోదు కాకపోగా, డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ టైటిల్ నిలబెట్టుకుంది. దుబాయ్ లో జరిగిన ఫైనల్లో ముంబయి జట్టు 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 157 పరుగుల లక్ష్యాన్ని ముంబయి జట్టు మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.
ముంబయి జట్టులో సారథి రోహిత్ శర్మ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతులు ఆడిన రోహిత్ 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత రోహిత్ అవుటైనా సాధించాల్సిన పరుగులు తక్కువగా ఉండడంతో విజయం నల్లేరుపై నడకే అయింది. ఇషాన్ కిషన్ 33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. పొలార్డ్ (9), హార్దిక్ పాండ్య (3) స్వల్ప స్కోర్లకే అవుట్ కాగా, చివర్లో కృనాల్ పాండ్య సింగిల్ తీయడంతో ముంబయి మురిసింది.
కాగా ఐపీఎల్ లో తొలిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ జట్టు టైటిల్ సాధించాలన్న ఆశలపై ముంబయి నీళ్లు చల్లింది. ముంబయి కి ఇది ఐదో ఐపీఎల్ టైటిల్. ముంబయి ఇండియన్స్ ఇంతకుముందు 2013, 2015, 2017, 2019లోనూ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ లో మరే జట్టు ఇన్ని టైటిళ్లు నెగ్గలేదు.