Maha Ghatabandhan: బీహార్ లో సాధారణ మెజారిటీని మించిన స్థానాలలో ఆర్జేడీ ఆధిక్యం!
- 126 స్థానాల్లో ఆర్జేడీ కూటమి ముందంజ
- 104 స్థానాలకు ఎన్డీయే పరిమితం
- ఆర్జేడీ కార్యాలయాల వద్ద సందడి
బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘటబంధన్ అధికారంలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం 242 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో ఇప్పటివరకూ 236 స్థానాల్లో ట్రెండ్స్ వెలువడ్డాయి. ఆర్జేడీ కూటమి సాధారణ మెజారిటీకి అవసరమైన 122 స్థానాల కన్నా అధిక స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది.
ప్రస్తుతం మహా ఘటబంధన్ 126 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్డీయే 104 స్థానాలకు పరిమితమైంది. ఎల్జేపీ 3, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అయితే, ఇప్పటివరకూ తొలి, రెండో రౌండ్ లెక్కింపు మాత్రమే జరిగిందని, విజయం సాధించేందుకు తమకు అన్ని అవకాశాలూ ఉన్నాయని ఎన్డీయే నేతలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మహా ఘటబంధన్ కార్యకర్తలు సంబరాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద ఇప్పటికే సందడి ప్రారంభమైంది.