Jagan: న్యాయవ్యవస్థను జగన్ నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు: జడ్జి రామకృష్ణ

Jagan will go to jail says Judge Ramakrishna

  • వైయస్సార్ మొహం చూసే జగన్ కు ఓట్లు వేశారు
  • జగన్ చరిత్ర హీనుడిగా మారబోతున్నారు
  • ఓట్లు వేసిన జనాలను కూడా శత్రువులుగా చూస్తున్నారు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే జైలుకి వెళ్లడం ఖాయమని జడ్జి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ తోనే వైసీపీ అంతరించిపోతుందని చెప్పారు. జగన్ త్వరలోనే చరిత్ర హీనుడిగా మారబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత రాజశేఖరరెడ్డి మొహం చూసే జగన్ కు ఓట్లు వేశారని చెప్పారు. తనకు తాను దిగజారిపోతున్న విషయాన్ని జగన్ గుర్తించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నో కేసులను ఎదుర్కొంటున్న జగన్... చివరకు న్యాయ వ్యవస్థ పైనే దాడికి సిద్ధపడ్డారని రామకృష్ణ మండిపడ్డారు. న్యాయ వ్యవస్థపై బురద చల్లుతూ... ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారని అన్నారు. జగన్ పై రాష్ట్రపతికి లేఖ వెళ్లిందని... ఆ లేఖలోని అంశాలు వెలుగులోకి వస్తే జగన్ పని అయిపోయినట్టేనని చెప్పారు. చివరకు తనకు ఓట్లు వేసిన ప్రజలను కూడా జగన్ శత్రువులుగా చూస్తున్నారని మండిపడ్డారు.

జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అక్రమాలను తాను బయటపెట్టినప్పటి నుంచి తనను వెంటాడి వేధిస్తున్నారని రామకృష్ణ తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డ నాగార్జునరెడ్డిని వైసీపీ ప్రభుత్వం ఈఆర్సీ ఛైర్మన్ గా నియమించిందని విమర్శించారు. మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ఇచ్చిన తీర్పు ప్రకారం తెలంగాణ హైకోర్టులో నాగార్జునరెడ్డిపై వెంటనే విచారణ జరగాలని చెప్పారు.

దళిత న్యాయమూర్తి అయిన తనను జగన్ టార్గెట్ చేశారని... తనతో పాటు, తన సోదరుడిపై కూడా అక్రమ కేసులు పెట్టారని రామకృష్ణ అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో అందరికీ తెలుసని... తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డిలు చిత్తూరు జిల్లాను దోచుకుంటున్నారని ఆరోపించారు. అటవీ, భూగర్భ సంపదను కొల్లగొడుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News