Andhra Pradesh: స్కూళ్లకు విద్యార్థులను పంపించడం తప్పనిసరేమీ కాదు: స్పష్టం చేసిన ఏపీ మంత్రి అవంతి
- తుది నిర్ణయం తల్లిదండ్రులదే
- ఇష్టం ఉంటేనే పంపించవచ్చు
- పేద విద్యార్థుల కోసమే స్కూళ్లు తెరిచాం
- బలవంతంగా స్కూళ్లకు రప్పించడం లేదన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలను తిరిగి తెరచినంత మాత్రాన విద్యార్థులు స్కూళ్లకు తప్పనిసరిగా రావాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. తమ పిల్లలను స్కూళ్లకు పంపించాలా? వద్దా? అన్న విషయాన్ని తల్లిదండ్రుల సమ్మతికే వదిలేశామని ఆయన గుర్తు చేశారు. పేరెంట్స్ కు ఇష్టం ఉంటేనే పిల్లలను స్కూళ్లకు పంపవచ్చని, పంపకున్నా నష్టమేమీ లేదని అన్నారు.
చాలా మంది పేద విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులను వినేందుకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్ లను కొనుగోలు చేయలేకపోతున్నారని, వీరితో పాటు నెట్ సౌకర్యం లేని వారి కోసమే స్కూళ్లు తిరిగి తెరిచామని ఆయన అన్నారు. ప్రభుత్వం బలవంతంగా పిల్లలను స్కూళ్లకు రప్పించడం లేదని వెల్లడించారు.
కాగా, ఏపీలో ఈ నెల తొలివారంలో స్కూళ్లను తిరిగి తెరచిన సంగతి తెలిసిందే. కొవిడ్ ప్రొటోకాల్స్ ను పాటిస్తూ, తరగతులను తిరిగి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, కొన్ని చోట్ల విద్యార్థులకు కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ 500 మందికి పైగా విద్యార్థులతో పాటు 829 మంది టీచర్లకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యా శాఖ అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.