Sunrisers: ఐపీఎల్ క్వాలిఫయర్-2: సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం... ఏంచేస్తారో!
- మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ
- 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 రన్స్
- రాణించిన ధావన్, స్టొయినిస్
ఐపీఎల్ మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ జట్టు ప్రత్యేకమైనది. అత్యధిక శాతం మ్యాచ్ లు బౌలింగ్ పటిమతోనే గెలుచుకుంది. కానీ ఇవాళ ఐపీఎల్ క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు విఫలమయ్యారు. దాని ఫలితమే ఢిల్లీ భారీ స్కోరు! మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది.
ఓపెనర్ గా ప్రమోషన్ పొందిన మార్కస్ స్టొయినిస్ అందించిన మెరుపు ఆరంభాన్ని మిగతా బ్యాట్స్ మెన్ కూడా కొనసాగించడంతో ఢిల్లీ భారీ స్కోరు నమోదు చేసింది. స్టొయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 38 పరుగులు చేయగా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ ఫామ్ అందుకుని చెలరేగిపోయాడు. ధావన్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లతో విజృంభించాడు. అయ్యర్ 21 పరుగులు నమోదు చేయగా, చివర్లో హెట్మెయర్ 22 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ ఇన్నింగ్స్ లో పలు క్యాచ్ లు వదిలిన సన్ రైజర్స్ తగిన మూల్యం చెల్లించింది. సన్ రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ 1, హోల్డర్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.