Rajiv Gandhi: వారిని తమిళులుగా చెప్పుకోవడం దారుణం కాదా: రాజీవ్ హంతకుల విడుదల డిమాండ్‌పై టీఎన్‌సీసీ చీఫ్ అళగిరి
- తమిళులన్న సానుభూతితో విడుదల చేయాలనడం దారుణం
- హంతకులను తమిళలని సానుభూతి చూపిస్తే మరి మిగతా వారి సంగతేంటి?
- న్యాయస్థానమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి
భారత మాజీ ప్రధాని రాజీవ్ హత్యకేసు దోషులు ఏడుగురిని విడుదల చేయాలంటూ అన్నాడీఎంకే, డీఎంకే సహా ప్రధాన పార్టీలు డిమాండ్ చేస్తుండడంపై టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి స్పందించారు. దోషులను విడుదల చేయాలని ఒత్తిడి చేయడం సబబు కాదని అన్నారు. ఈ విషయంలో న్యాయస్థానమే తగిన నిర్ణయం తీసుకోగలదని పేర్కొన్నారు. దోషులు కేవలం తమిళులన్న కారణంతో విడుదల చేయాలని చూస్తే, 25 ఏళ్లకు పైగా వివిధ జైళ్లలో మగ్గుతున్న తమిళ ఖైదీలందరూ తమను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తారని అన్నారు.
కాబట్టి ఈ విషయంలో న్యాయస్థానాలు చెప్పే దానిని బట్టి నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. కోర్టు కనుక వారి విడుదలకు అనుమతిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అభ్యంతరం ఏమీ ఉండదని, తాము కూడా స్వాగతిస్తామని అన్నారు. దోషులను హంతకులుగా భావించాలే తప్ప తమిళులన్న సానుభూతి పనికిరాదని అన్నారు. కామరాజర్, అన్నాదురై, కరుణానిధి, రామానుజం వంటి వారిని తమిళులుగా చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది కానీ, రాజీవ్ హంతకులను తమిళులుగా చెప్పుకుని విడుదలకు డిమాండ్ చేయడం దారుణమన్నారు.