Madras Highcourt: బాలికపై అత్యాచారం... పెళ్లి చేసుకుంటాననడంతో బెయిల్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు!
- బాలికను ప్రేమించిన యువకుడు
- మైనారిటీ తీరగానే వివాహం చేసుకుంటానని హామీ
- బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం
17 సంవత్సరాల బాలికపై పలుమార్లు అత్యాచారం జరిపి, ఆమె గర్భాన్ని ధరించడానికి కారణమైన నిందితుడు తప్పును ఒప్పుకోవడంతో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ బెయిల్ ను మంజూరు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నిందితుడు, ఓ బాలిక గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో వారిద్దరూ హద్దులు దాటగా, బాలిక గర్భం దాల్చింది. ఆపై ఆమె ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు.
మూడు నెలల పాటు జైల్లో ఉన్న తరువాత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. తన క్లయింట్, బాధితురాలు ప్రేమించుకున్నారని, ఆమెకు అన్యాయం చేయాలని భావించడం లేదని, వివాహం చేసుకుంటానని క్లయింట్ అంటున్నాడని, అతని తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆమెకు వచ్చే సంవత్సరం 18 సంవత్సరాలు నిండుతాయని, ఆపై అక్టోబర్ 10లోపు వివాహం చేసుకుంటాడని తెలిపారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, నిందితుడికి బెయిల్ ను మంజూరుచేస్తున్నట్టు తెలిపారు. పెళ్లి చేసుకున్న వెంటనే వివాహ సర్టిఫికెట్ ను పోలీసు స్టేషన్ లో సమర్పించాలని ఆదేశించారు.