Narendra Modi: జో బైడెన్, కమలా హారిస్‌లకు ప్రధాని మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు
- మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా
- భారత్, అమెరికా మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్తా
- హారిస్‌కు మోదీ వినూత్నంగా శుభాకాంక్షలు
అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా విజయం సాధించిన జో బైడెన్, కమలా హారిస్‌లకు భారత ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. బైడెన్ విజయంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆకాంక్షిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. గతంలో ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు కూడా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సమయంలో హారిస్ ఉపయోగించిన తమిళ ‘చిట్టీస్’ పదాన్ని ప్రధాని ఈ సందర్బంగా ఉపయోగిస్తూ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో మీరు సాధించిన ఘనత ఒక్క ‘చిట్టీస్’కే పరిమితం కాదని, ఇండియన్ అమెరికన్లు అందరికీ గర్వకారణమని పేర్కొన్న ప్రధాని.. ఆమె నాయకత్వం, సహకారంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా జో బైడెన్, కమలా హారిస్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.