Andhra Pradesh: కర్నూలు జిల్లాలో రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్య.. విచారణకు ఆదేశించిన సీఎం

CM YS Jagan Ordered inquiry in Nandyal family suicide case

  • ఓ దొంగతనం విషయంలో పోలీసుల వేధింపులు
  • తట్టుకోలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య
  • వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో

పోలీసుల వేధింపులు తాళలేక కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఓ కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. ఓ దొంగతనం విషయంలో పోలీసులు తమను వేధిస్తున్నారన్న మనస్తాపంతో పట్టణానికి చెందిన అబ్దుల్ సలాం (45), ఆయన భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కుమార్తె సల్మా (14)లు ఈ నెల 3న జిల్లాలోని కౌలూరు వద్ద గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంతకుముందు వారు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో ఆరోపించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

తానేమీ తప్పు చేయలేదని, ఆటోలో జరిగిన దొంగతనానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని సలాం అందులో పేర్కొన్నాడు. అంతేకాదు, అంగట్లో జరిగిన దొంగతనంతో కూడా తనకు ఎటువంటి సంబంధం లేదన్నాడు. అయినప్పటికీ పోలీసుల టార్చర్ భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు సాయం చేసే వారు ఎవరూ లేరని, చావుతోనే తమకు మనశ్శాంతి కలుగుతుందని భావిస్తున్నట్టు చెబుతూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె కుటుంబం ఆత్మహత్యకు పోలీసులే కారణమని, తమ అల్లుడిని పోలీసులు 8 రోజులపాటు చితకబాదారని నూర్జహాన్ తల్లి మాబున్నీసా ఆరోపించింది.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విచారణ జరిపించాలంటూ డీజీపీ సవాంగ్‌ను ఆదేశించారు. బెటాలియన్స్ ఐజీ శంకబ్రత బాగ్జి, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్‌ను విచారణ అధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక, నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌ను సస్పెండ్ చేశారు. మరోవైపు హోంమంత్రి సుచరిత కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను సహించబోమని పేర్కొన్న మంత్రి.. ఆత్మహత్యలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News