Andrew Bates: ట్రంప్ ను దురాక్రమణదారుగా అభివర్ణించిన బైడెన్ అధికార ప్రతినిధి
- విజయానికి అత్యంత చేరువగా జో బైడెన్
- ట్రంప్ ఇక వైట్ హౌస్ నుంచి వెళ్లిపోవచ్చన్న బైడెన్ అధికార ప్రతినిధి
- లేకపోతే అమెరికా ప్రభుత్వమే ఖాళీ చేయిస్తుందని వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ హవా కొనసాగుతోంది. జార్జియా, నెవాడా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఏ ఒక్కదాంట్లో నెగ్గినా బైడెన్ విజయం ఖరారైనట్టే. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా వెనుకబడి ఉన్న నేపథ్యంలో ఆయన ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాల్లో గెలిచినా మళ్లీ అధ్యక్షుడు కావడం అసాధ్యం! ఈ క్రమంలో తమదే వైట్ హౌస్ అని బైడెన్ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
ఈ క్రమంలో బైడెన్ అధికార ప్రతినిధి ఆండ్రూ బేట్స్ మాట్లాడుతూ, ట్రంప్ ను దురాక్రమణదారుగా పేర్కొన్నారు. దురాక్రమణదారులు వైట్ హౌస్ నుంచి వెళ్లిపోవచ్చని, లేకపోతే అమెరికా ప్రభుత్వం వారితో కచ్చితంగా ఖాళీ చేయిస్తుందని వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల్లో విజేత ఎవరో ప్రజలే చెప్పారని అన్నారు. ప్రస్తుతం బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సంపాదించారు. మరో 6 ఓట్లు లభిస్తే అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఆయన వశమవుతుంది.