Snake Head Eel: పక్షి పొట్ట చీల్చుకుని బయటికి వచ్చిన ఈల్ చేప!
- అమెరికాలో ఘటన
- ఓ ఫొటోగ్రాఫర్ కంటబడిన దృశ్యం
- పొట్టచీలినా బతికే ఉన్న పక్షి
అమెరికాలోని మేరీల్యాండ్ లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. కొంగ జాతికి చెందిన ఓ హెరాన్ పక్షి పొట్ట చీల్చుకుని స్నేక్ హెడ్ ఈల్ (మలుగు) చేప బయటికి వచ్చిన దృశ్యం ఫొటోగ్రాఫర్ కంటబడింది. శామ్ డేవిస్ అనే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ మేరీల్యాండ్ అటవీప్రాంతంలో ఫొటోలు తీస్తుండగా, ఓ హెరాన్ పక్షి ఎగురుతూ రావడాన్ని గమనించాడు. అయితే దాని పొట్ట కింది భాగంలో ఓ పాము వంటి ఆకారం ఉండడాన్ని గుర్తించాడు.
అది స్నేక్ హెడ్ ఈల్ గా భావించిన శామ్ డేవిస్ అది హెరాన్ పక్షి ఉదర భాగానికి అతుక్కుని ఉందేమో అనుకున్నాడు. అయితే ఆ పక్షి దగ్గరగా రావడంతో, ఆ ఈల్ చేప పక్షి పొట్టను చీల్చుకుని వచ్చినట్టు గుర్తించాడు. ఆ ఈల్ చేప పొట్ట చీల్చడంతో గాయమైనా, హెరాన్ పక్షి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగురుతుండడం విశేషం.
సాధారణంగా ఈల్ చేపలు పక్షులు తమను భోంచేసినప్పుడు తమ పదునైన తోకతో బయటపడేందుకు ప్రయత్నిస్తాయని ఫొటోగ్రాఫర్ శామ్ డేవిస్ వెల్లడించాడు. సాధారణ పరిస్థితుల్లో పొట్ట చీలిపోతే పక్షి బతకడం కష్టమని, కానీ ఈ హెరాన్ బతికుండడం విస్మయానికి గురిచేస్తుందని అన్నాడు.