MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువు పెంచాలంటూ పిల్.. హైకోర్టు ఆదేశాలు
- కరోనా, భారీ వర్షాల నుంచి ప్రజలు కోలుకోలేదని పిటిషన్
- ఓటరు నమోదుకు తగినంత ప్రచారం కూడా కల్పించలేదన్న పిటిషనర్
- ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం
కరోనా వైరస్ తో పాటు భారీ వర్షాల నేపథ్యంలో పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను ఓటరు నమోదుకు గడువు పెంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓటరు నమోదు ప్రక్రియకు గడువును పెంచాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది టీవీ రమేశ్ పిల్ దాఖలు చేశారు. ఓటర్ల నమోదుకు పట్టభద్రుల నియోజకవర్గాల్లో తగినంత ప్రచారం కల్పించలేదని, భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లోని ప్రజలు ఇంకా కోలుకోలేదని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 7 వ తేదీ వరకు ఓటరు నమోదు ప్రక్రియను పొడిగించాలని హైకోర్టును కోరారు.
ఈ పిటిషన్ ను జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బొల్లారం విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సాధారణ పరిస్థితుల్లో అయితే షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్లడం సరికావచ్చని... ప్రస్తుతం కరోనా, భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను ఈసీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అవినాశ్ దేశాయ్ తమ వాదనలను వినిపిస్తూ... అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 మధ్య పట్టభద్రులు తమ ఓట్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని... దీని ఆధారంగా ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందిస్తామని చెప్పారు. వీటిపై అభ్యంతరాలుంటే డిసెంబర్ 1 నుంచి 31 వరకు గడువు ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్ పిటిషన్ మేరకు ఓటరు నమోదుకు గడువు పెంచడంపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు.