PSLV C-49: శ్రీహరికోటలో మళ్లీ సందడి... పీఎస్ఎల్వీ సి-49 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం
- షార్ లో రేపు రాకెట్ ప్రయోగం
- మధ్యాహ్నం 3.02 గంటలకు నింగిలోకి పీఎస్ఎల్వీ సి-49
- పది ఉపగ్రహాలను మోసుకెళ్లనున్న రాకెట్
కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ ప్రకటించాక శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రంలో కార్యకలాపాలు మందగించాయి. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడడంతో షార్ కేంద్రంలో మరోసారి ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. రేపు శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సి-49 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం కోసం ఈ మధ్యాహ్నం 1.02 గంటలకు మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం రేపు మధ్యాహ్నం 3.02 గంటలకు జరగనుంది. అప్పటివరకు కౌంట్ డౌన్ నిరంతరాయంగా కొనసాగనుంది.
ఇస్రోకు నమ్మదగిన నేస్తంగా పేరుగాంచిన పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా భారత్ కు చెందిన ఈఓఎస్ఓ1 ఉపగ్రహంతో పాటు మరో 9 అంతర్జాతీయ వాణిజ్య ఉపగ్రహాలను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈఓఎస్-01 ఓ నిఘా ఉపగ్రహం. ఇందులోని సింథటిక్ అపెర్చర్ రాడార్ ద్వారా భూమిపై కొద్దిపాటి కదలికలను కూడా గుర్తించవచ్చు. ముఖ్యంగా, చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో నిఘా కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే, ఇస్రో తన ప్రకటనలో వ్యవసాయం, అటవీభూముల పరిశీలన, విపత్తు నిర్వహణలకు మద్దతు వంటి అంశాలకు ఈఓఎస్ -01 తోడ్పాటునందిస్తుందని పేర్కొంది.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో... షార్ కేంద్రంలో మీడియా ప్రతినిధులు గుమికూడేందుకు అనుమతించబోరని తెలుస్తోంది. అంతేకాదు, ప్రయోగాన్ని తిలకించేందుకు ప్రజలకు ఈసారి అనుమతి లేనట్టేనని తాజా ప్రకటన చెబుతోంది. ప్రయోగం సందర్భంగా గ్యాలరీ మూసివేస్తున్నామని ఇస్రో వెల్లడించింది.