Mekapati Goutham Reddy: మంత్రి మేకపాటితో తైవాన్ కంపెనీల ప్రతినిధుల సమావేశం
- ఏపీ పెట్టుబడులకు స్వర్గధామం అని పేర్కొన్న మేకపాటి
- రాష్ట్రంలో విస్తృత మౌలిక సదుపాయాలు ఉన్నాయని వెల్లడి
- తైవాన్ భాగస్వామ్యంతో వేగంగా అభివృద్ధి జరుగుతుందని ఉద్ఘాటన
ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో తైవాన్ దేశానికి చెందిన కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఫోక్స్ లింక్, అపాచీ, పీఎస్ఏ వాల్విన్, గ్రీన్ టెక్ సంస్థల ప్రతినిధులు మంత్రి మేకపాటితో సమావేశమై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామం అని పేర్కొన్నారు. ఏపీలో మౌలిక సదుపాయాలు విస్తృతంగా ఉన్నాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు.
విద్య, వైద్య, సాగు, పరిశ్రమల రంగాల్లో అనేక సంస్కరణలు చేపట్టామని వివరించారు. కడప జిల్లాలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అభివృద్ధి చేస్తామని మంత్రి మేకపాటి చెప్పారు. రాష్ట్రంలో 3 పారిశ్రామిక కారిడార్లు, 8 హార్బర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని అన్నారు. తాజాగా తైవాన్ భాగస్వామ్యంతో మరింత వేగంగా పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు.