Donald Trump: పోలింగ్ తరువాత ట్రంప్ తొలి లైవ్... పదేపదే అబద్ధాలు చెబుతున్నారంటూ కట్ చేసిన టీవీ చానెళ్లు!
- అధ్యక్షుడి ప్రసంగానికి అంతరాయం
- లైవ్ ను కట్ చేసిన పలు చానెళ్లు
- దురదృష్టకరమైన రాత్రన్న సీఎన్ఎన్ యాంకర్
అమెరికా అధ్యక్ష స్థాయిలో ఉన్న వ్యక్తి, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారంటే, అమెరికాతో పాటు ప్రపంచమంతా ఆయన ఏం చెబుతారోనన్న ఆసక్తిని కనబరుస్తుంది. ఆ కార్యక్రమాన్ని లైవ్ లో ప్రసారం చేసేందుకు టీవీ చానెళ్లు పోటీపడతాయి. కానీ, తాజాగా అందుకు విరుద్ధంగా జరిగింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాల తరువాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడుతుండగా, పలు టీవీ చానెళ్లు, ఆ ప్రసారాన్ని మధ్యలోనే నిలిపివేశాయి.
ఈ కార్యక్రమం 17 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారం చేసిన అనంతరం ఎంఎస్ఎన్బీసీ యాంకర్ బ్రియాన్ విలియమ్స్ కల్పించుకుని, "సరే... మనం ఇప్పుడు అధ్యక్షుడి ప్రసంగానికి అంతరాయం కల్పించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నాం" అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఆయన ప్రసంగాన్ని టీవీ చానెల్ నిలిపివేసింది. ఎన్బీసీ, ఏబీసీ న్యూస్ తదితర టీవీ చానెళ్లు సైతం ఆయన లైవ్ కవరేజ్ ని నిలిపివేశాయి.
"ఎంత దురదృష్టకరమైన రాత్రి? అమెరికా అధ్యక్షుడే స్వయంగా ప్రజలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారు" అని సీఎన్ఎన్ యాంకర్ జేక్ టాపర్ వ్యాఖ్యానించారు. ఆయన ఆరోపణలకు ఒక్క సాక్ష్యం కూడా లేదని ఆయన అన్నారు.