India: భారత ప్రయాణికులపై చైనా నిషేధం!
- తక్షణం తాత్కాలిక నిషేధం అమలులోకి
- దౌత్యపరమైన రక్షణ ఉన్నవారికి మినహాయింపు
- మరికొన్ని దేశాల ప్రయాణికులపైనా ఆంక్షలు
ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలిక నిషేధాన్ని విధిస్తున్నట్టు చైనా వెల్లడించింది. చెల్లుబాటయ్యే వీసాలున్న వారికి, నివాస హక్కును కలిగివున్న వారిపై కూడా నిషేధం వర్తిస్తుందని న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ పేర్కొంది. అయితే, ఈ ఆదేశాలు కేవలం ఇండియాకు మాత్రమే కాదని, కరోనా కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా, పలు దేశాల ప్రయాణికులపైనా చైనా ఇదే తరహా ప్రయాణ ఆంక్షలు విధించిందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇండియాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపైనా చైనా నిషేధం విధించినట్టు తెలుస్తోంది. "కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు చెల్లుబాటయ్యే చైనా వీసాలు లేదా రెసిడెన్స్ పర్మిట్ లు ఉన్నావారు సహా, ఇండియాకు చెందిన అందరు ట్రావెలర్స్ నూ, చైనాలో అడుగు పెట్టనీయకుండా తాత్కాలిక నిషేధం విధిస్తున్నాం" అని ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ నోట్ ను చైనా ఎంబసీ తన అధికారిక వెబ్ సైట్ లో పెట్టింది. అయితే, దౌత్య పరమైన రక్షణ ఉన్నవారితో పాటు సర్వీస్ సెక్టార్ పరిధిలోని వారికి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఇక అత్యవసర పనులు లేదా మానవత్వపు కార్యకలాపాలపై చైనాకు వెళ్లాలని భావించే వారు, వీసా దరఖాస్తులను ఎంబసీలో అందించి, అనుమతి పొందవచ్చని, నవంబర్ 3 తరువాత జారీ కాబడిన వీసాలపై మాత్రం ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది.