Jagan: మూడేళ్ల క్రితం ఇదే రోజు... 3,648 కి.మీ జగన్ పాదయాత్రకు తొలి అడుగు!

3 Years for Jagan Padayatra

  • 14 నెలలు కొనసాగిన ప్రజా సంకల్పయాత్ర
  • 2017 నవంబర్ 6 నుంచి 2019 జనవరి 9 వరకు
  • 134 నియోజకవర్గాల పరిధిలో నడిచిన జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలను తెలుసుకుని, వారికి తానున్నానన్న భరోసాను ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా వైఎస్ జగన్, పాదయాత్రను ప్రారంభించి నేటికి సరిగ్గా మూడు సంవత్సరాలు. 2017, నవంబర్ 6న తన ప్రజా సంకల్పయాత్రను వైఎస్ జగన్, కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారకం నుంచి ప్రారంభించారు. ఆపై 14 నెలల పాటు ప్రజల్లోనే ఉన్న ఆయన, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, 2019 జనవరి 9వ తేదీన ఇచ్చాపురం చేరుకుని, 3,648 కిలోమీటర్ల దూరాన్ని నడిచి సరికొత్త చరిత్ర సృష్టించారు.

ఈ ప్రజా సంకల్పయాత్రలో, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ చేసిన అభ్యర్థన ప్రజల్లోకి చొచ్చుకెళ్లి, తదుపరి జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి పెట్టింది. అనూహ్యరీతిలో 151 అసెంబ్లీ, 22 లోక్ సభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, అదే సంవత్సరం మే 30న ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించారు.

ఇదిలావుండగా, తొలుత 13 జిల్లాల్లో 6 నెలల పాటు పాదయాత్ర చేయాలని వైసీపీ తొలుత నిర్ణయించినప్పటికీ, యాత్ర 14 నెలల పాటు కొనసాగింది. జగన్ ను చూసేందుకు తరలివచ్చిన ప్రజల కారణంగా రోజుకు దాదాపు 13 నుంచి 15 కిలోమీటర్ల యాత్రే సాగుతూ వచ్చింది. జగన్ సైతం ప్రజల్లో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ, తన యాత్రను నిదానంగా సాగించారు. కోర్టుకు హాజరు కావాల్సి వుండటం కూడా కొన్ని రోజులు యాత్రను పొడిగించేందుకు కారణమైంది.

13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాల పరిధిలోని 231 మండలాలు, 2,516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాలను కలుపుతూ ప్రజా సంకల్పయాత్రను నిర్వహించిన జగన్, 124 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 55 ఆత్మీయ సమావేశాలను కూడా నిర్వహించారు. ఇక యాత్రకు కావాల్సిన అన్ని ఏర్పాట్లనూ పార్టీ ప్రధాన నేతలు స్వయంగా పర్యవేక్షించారు. జగన్ మధ్యాహ్న బస ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతానికి ముందు రోజే చేరుకుని గుడారాలు వేసి, వంటలు చేశారు. వీఐపీలకు ప్రత్యేకంగా, యాత్రలో పాల్గొంటున్న కార్యకర్తలకు మరో ప్రాంతంలో వండి వడ్డించారు. ఇందుకోసం నాలుగు టీమ్ లు నిరంతరమూ పనిచేశాయి.

  • Loading...

More Telugu News