Donald Trump: బ్లూ వేవ్ ఎక్కడిది? అంతా రెడ్ వేవే!: ట్రంప్
- ఎన్నికల తర్వాత తొలిసారి వైట్‌హౌస్‌కు
- మెయిల్ ఇన్ ఓటింగ్ అవినీతి పుట్ట అన్న ట్రంప్
- లీగల్ ఓట్లను లెక్కిస్తే తనదే గెలుపని ధీమా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ప్రస్థానం దాదాపు ముగిసినట్టు వార్తలు వస్తున్న వేళ నిన్న తొలిసారి ఆయన వైట్‌హౌస్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో బ్లూ వేవ్ (డెమొక్రాట్ల గాలి) ఎక్కడా కనిపించలేదని, ప్రతి చోట రెడ్ వేవే (రిపబ్లికన్ గాలి) ఉందన్నారు. మెయిల్ ఇన్ ఓటింగ్‌ను అవినీతి వ్యవస్థగా అభివర్ణించిన ట్రంప్, ఈ ఏడాది రిపబ్లిక్ మహిళల సంవత్సరంగా నిలిచిపోతుందన్నారు.
ఎన్నికలు మొదలైనప్పటి నుంచి మీడియాపై మండిపడుతున్న ట్రంప్ తాజాగా మరోమారు మీడియాను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మీడియా, టెక్ కంపెనీలు జోక్యం చేసుకున్నాయని, అయినప్పటికీ చాలా రాష్ట్రాల్లో తన గెలుపును ఆపలేకపోయినట్టు పేర్కొన్నారు. లీగల్ ఓట్లను లెక్కిస్తే కనుక తన విజయం మరింత సులభం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.