Hero Vijay: మా నాన్న పార్టీతో నాకు సంబంధంలేదు... ఆ పార్టీ కోసం ఫ్యాన్స్ పనిచేయాల్సిన అవసరంలేదు: తమిళ హీరో విజయ్

Hero Vijay clarifies over his father political party or future political plans

  • రాజకీయ పార్టీ కోసం దరఖాస్తు చేసుకున్న విజయ్ తండ్రి
  • మీడియా కథనాలపై హీరో విజయ్ స్పందన
  • తన పేరు, ఫొటో ఉపయోగించవద్దని హెచ్చరిక

ప్రముఖ తమిళ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ (సీనియర్ దర్శకుడు) ఓ రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్టు తీవ్ర ప్రచారం జరుగుతోంది. అది కూడా తన కుమారుడు విజయ్ పేరు మీదే ఆ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయిస్తున్నారని కథనాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హీరో విజయ్ స్పందించారు. తన తండ్రి రాజకీయ పార్టీతో తనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఆ పార్టీకి సంబంధించిన ఏ విషయంలోనూ తాను పాలుపంచుకోవడంలేదని ఓ ప్రకటనలో తెలిపారు. తన తండ్రి పార్టీ ప్రారంభించాడన్న విషయం మీడియా కథనాల ద్వారానే తెలిసిందని పేర్కొన్నారు.

"నా తండ్రి భవిష్యత్తులో తీసుకునే ఎలాంటి రాజకీయ నిర్ణయం నాకు అవరోధం కాబోదు, నాపై ఎలాంటి ప్రభావం చూపదు. అంతేకాదు, నా తండ్రి పార్టీ కదా అని నా అభిమానులెవరూ అందులో చేరాల్సిన అవసరంలేదు, ఆ పార్టీ కోసం పనిచేయనక్కర్లేదు. మనం ఎవ్వరం ఆ పార్టీ జోలికి వెళ్లబోవడంలేదు" అని హీరో విజయ్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా విజయ్ ఓ హెచ్చరిక కూడా చేశారు. ఈ పార్టీకి సంబంధించి తన పేరు, ఫొటో ఎవరూ ఉపయోగించవద్దని స్పష్టం చేశారు.

కాగా, విజయ్ తండ్రి ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరిట ఓ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. ఇది పూర్తిగా తన కార్యాచరణ అని, ఇది విజయ్ కి సంబంధించిన రాజకీయ పార్టీ కాదని స్పష్టం చేశారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తాడో, రాడో అనే అంశంపై తానేమీ వ్యాఖ్యానించలేనని తెలిపారు.

  • Loading...

More Telugu News