Donald Trump: ఓడిన తర్వాత ట్రంప్ వైట్ హౌస్ ను ఖాళీ చేయనంటే ఏం జరుగుతుంది..?

If what happened Trump would not vacate White House after defeat

  • ఓటమిని అంగీకరించే ప్రశ్నే లేదంటున్న ట్రంప్
  • సుప్రీంకోర్టులో తేల్చుకుంటానని వెల్లడి
  • ట్రంప్ వైట్ హౌస్ ను వీడడంపై సందేహాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగానైనా మాట్లాడగల దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో తన ఓటమిని ఏమాత్రం అంగీకరించలేరన్నది ఆయన ప్రకటనల ద్వారా వెల్లడవుతోంది. జో బైడెన్ చేతిలో తాను ఓడిపోతే కోర్టుల్లోనే తేల్చుకుంటానని అంటున్నారు. ఓడిపోతే ఆ నిర్ణయాన్ని తాను హర్షించనని కరాఖండీగా చెబుతున్నారు.

ఈ క్రమంలో ట్రంప్ నిజంగానే ఓటమిపాలైతే వైట్ హౌస్ ను వీడడంపై సందేహాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఆయన వైట్ హౌస్ ను వీడి వెళ్లిపోకుండా మొండిపట్టు పడితే ఏంజరుగుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ట్రంప్ ప్రతికూల ఫలితం వస్తే సుప్రీంకోర్టుకు వెళతానని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన అధ్యక్షుడు పదవి నుంచి తప్పుకోవడానికి ససేమిరా అంటే ఏం చేయాలో అమెరికా రాజ్యాంగంలో పేర్కొనలేదు. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి కొనసాగాలని కోరుకుంటున్న ట్రంప్ ప్రస్తుత పదవీకాలం 2021 జనవరి వరకు ఉంది. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే సరి... ఓడిపోతే మాత్రం ఆయనను జో బైడెన్ ప్రభుత్వం వైట్ హౌస్ లో ఎలా ఉండనిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఓటమిని  అంగీకరించి హుందాగా తప్పుకోవడం ఓ మార్గమని, కానీ ట్రంప్ ఎన్నికల ఫలితాలపై కోర్టులను ఆశ్రయిస్తూ, న్యాయ ప్రక్రియలు కొనసాగినంత కాలం తన అధ్యక్ష కార్యాలయాన్ని వీడకపోవచ్చని కొలంబియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ షేపిరో తెలిపారు. ఇదేమీ పూర్తిగా కొత్త పరిణామం కాదని, 2000 అధ్యక్ష ఎన్నికల్లో టెక్సాస్ గవర్నర్ గా ఉన్న జార్జ్ డబ్ల్యూ బుష్ ఉపాధ్యక్షుడు అల్ గోర్ ను ఓడించారని ప్రస్తావించారు. బుష్ కు ఫ్లోరిడా రాష్ట్రంలో స్పష్టమైన ఆధిక్యం రాకపోయినా, న్యాయపోరాటాల ద్వారా అనుకూల ఫలితం అందుకున్నారని షేపిరో వివరించారు. ఆ సమయంలో బుష్ ఎన్నికల్లో నెగ్గినట్టు సుప్రీంకోర్టులో 5-4 మెజారిటీతో తీర్పు వచ్చిందని తెలిపారు.

కాగా, ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే సుప్రీంకోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేస్తున్న ట్రంప్ కు కొన్ని అనుకూలతలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ అదే హోదాలో సుప్రీంను ఆశ్రయిస్తారు. ఈ కేసు విచారణకు వస్తే మొత్తం 9 మంది జడ్జిల్లో ముగ్గుర్ని ట్రంప్ వ్యక్తిగతంగా నియమించే అధికారం ఉంది.

ఈ విషయాన్ని అటుంచితే... అన్ని మార్గాలు మూసుకుపోయినా ట్రంప్ వైట్ హౌస్ ను వీడకపోతే నూతన అధ్యక్షుడు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కీలకంగా మారతారు. నూతన అధ్యక్షుడి ఆదేశాలతో సీక్రెస్ సర్వీస్ ఏజెంట్లే ట్రంప్ ను వైట్ హౌస్ నుంచి ఖాళీ చేయిస్తారు. ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ట్రంప్ మాజీ అవుతారు... అప్పుడు ఆయనను అధ్యక్ష భవనం నుంచి తరలించేందుకు ప్రోటోకాల్ నిబంధనలు కూడా అడ్డురావు. అమెరికాలో ఇప్పటివరకు 45 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు రాగా, మరో ఐదు రాష్ట్రాల ఫలితాలు రావాల్సి ఉంది.  ఆ తర్వాతే ట్రంప్ భవితవ్యంపై పూర్తి స్పష్టత రానుంది.

  • Loading...

More Telugu News