North Korea: కిమ్ జాంగ్ ఉన్ సంచలన నిర్ణయం... ధూమపానంపై నిషేధం!
- తీర్మానాన్ని ఆమోదించిన అసెంబ్లీ
- బహిరంగ ధూమపానానికి కఠిన శిక్షలు
- ప్రజల ఆరోగ్యం కోసమేనన్న ప్రభుత్వం
ఉత్తరకొరియా అధినేత కింగ్ జాంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నార్త్ కొరియా పీపుల్స్ అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పొగాకు నిషేధ చట్టంతో పాటు సిగరెట్ల ఉత్పత్తి, వాటి అమ్మకాలపై చట్టపరమైన నియంత్రణను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన మీదటే, ఈ తీర్మానాన్ని చేశామని ఉన్నధికారులు వెల్లడించారు.
ఇకపై దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసిన వారికి కఠిన శిక్షలు అమలు చేయనున్నామని అధికారులు హెచ్చరించారు. కొరియా ప్రజల జీవితాలను పరిరక్షించడంతో పాటు వారి ఆరోగ్య సంరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇక మీదట సినిమా ధియేటర్ లు, ఆసుపత్రులు, విద్యా కేంద్రాలు తదితరాల్లో ధూమపాన నిషేధం అమలవుతుందని అన్నారు.
కాగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం, నార్త్ కొరియాలో దాదాపు 44 శాతం మంది ధూమపానం చేస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ధూమపానం చేసే పురుషులున్న దేశాల్లో ఉత్తర కొరియా కూడా ఒకటి.