IPL 2020: ముంబై, ఢిల్లీ... రెండు జట్లకే ఈ చాన్స్!

1st Qualifier Match today in IPL

  • చివరి అంకానికి చేరిన ఐపీఎల్ పోటీలు
  • నేడు గెలిచే జట్టు నేరుగా ఫైనల్స్ కు
  • క్రీడాభిమానులకు పూర్తి మజా

2020 సీజన్ ఐపీఎల్ పోటీలు చివరి అంకానికి చేరాయి. విజేతను నిర్ణయించేందుకు మరొక్క నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయి. నేడు జరిగే పోరులో ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ పోరాడనుండగా, విజేతగా నిలిచే జట్టు నేరుగా ఫైనల్స్ కు వెళ్లిపోతుంది. ఈ చాన్స్ ఈ రెండు జట్లకు మాత్రమే ఉంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయే జట్టు, ఎలిమినేటర్-1 మ్యాచ్ లో గెలిచే జట్టుతో పోరాడి గెలిస్తేనే ఫైనల్ కు వెళుతుంది.

ఇక ఓ వైపు నాలుగు సార్లు చాంపియన్ గా నిలిచిన జట్టు, మరోవైపు, ఇంతవరకూ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేక, ఈ దఫా ఎన్నో ఆశలు పెట్టుకున్న జట్టు నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, ఓటమి పాలయ్యే జట్టుకు ఇంకో చాన్స్ ఉంటుంది. కాగా, రెండు జట్ల బలాబలాలను, ఈ సీజన్ విజయాలను పరిశీలిస్తే, ముంబై జట్టుదే పైచేయిగా ఉన్నా, కేవలం రెండున్నర గంటల వ్యవధిలో ఏ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే, ఆ జట్టుదే విజయం అయ్యే ఐపీఎల్ లో ఢిల్లీ సైతం సర్వశక్తులూ ఒడ్డి పోరాడేందుకు సిద్ధమవుతోంది.

ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం పడుతూ, లేస్తూ సాగిందనడంలో సందేహం లేదు. తొలి దశలో 9 మ్యాచ్ లలో 7 విజయాలు సాధించిన ఢిల్లీ, ఆపై నాలుగు వరుస మ్యాచ్ లలో ఓడిపోయి, చివరకు తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో విజయం సాధించి, ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ఇక ముంబై జట్టు తొలి మ్యాచ్ లో ఓటమి మినహా, మిగతా అంతా సాఫీగానే సాగింది. 14 మ్యాచ్ లలో 9 మ్యాచ్ లలో విజయం సాధించింది. రెండు సార్లు సూపర్ ఓవర్ ఓడిపోయింది.

ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే, తొలి మ్యాచ్ నుంచీ ఢిల్లీ జట్టు సమష్టి ప్రదర్శనతోనే గెలుస్తూ వచ్చింది. స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ ఇప్పటికే 525 పరుగులు చేశాడు. ధావన్ కు సహకరించేందుకు శ్రేయాస్ అయ్యర్, స్టోయినిస్, పంత్ వంటి ఆటగాళ్లతో పాటు బౌలింగ్ లో రబాడా, నోర్జే, అక్సర్ పటేల్ లు ఎలానూ ఉన్నారు.

ముంబై విషయానికి వస్తే, ప్రధాన ఆటగాళ్లు ఫామ్ లో ఉండటం, సూర్యకుమార్, డికాక్, ఇషాంత్ కిషన్, పాండ్యాలతో పాటు పొలార్డ్ అదనపు బలం. బౌలింగ్ వరల్డ్ టాప్ బౌలర్ బుమ్రాతో పాటు నిప్పులు చెరిగే బంతులను వేయగల బౌల్ట్ లను ఎదుర్కోవడం ఎంతటి ప్రత్యర్థులకైనా కష్టమే. ఏదిఏమైనా నేటి రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పూర్తి మజాను ఇస్తుందనడంలో సందేహం లేదు.

IPL 2020
Mumbai Indians
Delhi Capitals
Qualifier 1
  • Loading...

More Telugu News