Kamala Harris: కమలహారిస్ విజయం సాధించాలంటూ పూర్వీకుల గ్రామంలో పూజలు... ఆమెకిష్టమైన వంటకాలతో అన్నదానం
- నేడు అమెరికాలో ఎన్నికలు
- ఉపాధ్యక్షురాలిగా పోటీ చేస్తున్న కమలహారిస్
- పూర్వీకుల గ్రామం తులసేంద్రపురంలో కోలాహలం
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. భారత సంతతికి చెందిన కమలహారిస్ డెమొక్రాటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కమల కుటుంబం చాన్నాళ్లకిందటే తమిళనాడు నుంచి అమెరికా వలస వెళ్లింది. ఇవాళ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కమలహారిస్ పూర్వీకుల గ్రామం తులసేంద్రపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్థానిక ధర్మశస్త ఆలయంలో పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించిన గ్రామస్తులు కమలహారిస్ గెలవాలని ప్రార్థించారు. ఆపై అన్నదానం కూడా చేశారు. ఈ అన్నదానంలో కమలహారిస్ కు ఇష్టమైన సాంబార్ ఇడ్లీ తదితర వంటకాలను వడ్డించడం విశేషం. దాదాపు 200 మంది గ్రామస్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తిరువారూరు జిల్లా తులసేంద్రపురం గ్రామంలో ఎక్కడ చూసినా కమలహ్యారిస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. కమలహారిస్ తప్పకుండా గెలుస్తుందని, గెలిచిన తర్వాత ఆమె తమ గ్రామానికి రావాలని కోరుకుంటున్నామని తులసేంద్రపురం గ్రామస్తులు అంటున్నారు.