Nimmagadda Ramesh: జస్టిస్ కనగరాజ్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- హైకోర్టు తీర్పుపై న్యాయపోరాటం చేసిన కనగరాజ్
- లాయర్ ఫీజులను చెల్లించిన ప్రభుత్వం
- ఆ మొత్తాన్ని కనగరాజ్ వ్యక్తిగతంగా భరించాలన్న ధర్మాసనం
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ స్థానంలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను గతంలో ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీగా బాధ్యతలను స్వీకరించిన కనగరాజ్ విజయవాడ బెంజ్ సర్కిల్ లోని వల్లూరి రవీంద్రనాథ్ ఫ్లాట్ లో అద్దెకు దిగారు. అయితే, ఆ తర్వాత కనగరాజ్ నియామకాన్ని హైకోర్టు కొట్టివేయడంతో ఆయన ఆ ప్లాట్ లో ఉండటం లేదు. దీంతో ఇంటి యజమాని రవీంద్రకు ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉంది.
మరోవైపు కనగరాజ్ నియామకం చెల్లదంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసిన తర్వాత ఆయన న్యాయపోరాటం చేశారు. అయితే, దీనికి సంబంధించిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కనగరాజ్ న్యాయపోరాటానికి ప్రభుత్వం ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆ మొత్తాన్ని కనగరాజ్ వ్యక్తిగతంగా భరించాలని తెలిపింది.
ప్రజాధనాన్ని ఇలా వృథా చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది. ఈ అంశంతో పాటు... కనగరాజ్ ఇంటి కోసం రూ. 20 లక్షలు, ఫర్నిచర్ కు రూ. 15 లక్షల అంశాన్ని కూడా ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పరిశీలించాలని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఇదంతా ప్రజల సొమ్మే కావడం వల్ల కనగరాజ్ లాయర్ ఖర్చుల వివరాలు ప్రజలకు తెలియాలని స్ఫష్టం చేసింది.