APSRTC: నేటి రాత్రి నుంచే... ఏపీ, టీఎస్ మధ్య బస్సులకు రైట్ రైట్!

Interstate Buses from Monday Night Between AP and TS
  • ఉన్నతాధికారుల నుంచి డిపో మేనేజర్లకు ఆదేశాలు
  • బస్సులను బయటకు తీసేందుకు సిద్ధం
  • ఈ మధ్యాహ్నం రెండు రాష్ట్రాల మధ్యా డీల్ పై సంతకాలు
  • ఆ వెంటనే ఆన్ లైన్ రిజర్వేషన్ సౌకర్యం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య లాక్ డౌన్ మొదటి రోజు నుంచి నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు నేటి రాత్రి నుంచి రాకపోకలను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు బస్సులను బయటకు తీసి, రాష్ట్రాల సరిహద్దులను దాటించేందుకు సిద్ధంగా ఉండాలని, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు రూట్లలో బస్సులను తిప్పాలని తెలంగాణ ఆర్టీసీకి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది.

 ఇదే సమయంలో ఒంగోలు, నెల్లూరు, కడప, చిత్తూరు, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వెళ్లే బస్సులను సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు అందినట్టు సమాచారం. ఈ మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్యా ఒప్పందంపై సంతకాలు జరిగిన మరుక్షణమే అన్ని రకాల బస్సులను డిపోల నుంచి బయటకు తీసుకుని వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఇప్పటికే 1.61 లక్షల కిలోమీటర్లను తగ్గించుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం రాత్రికే బస్సులను నడపనున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ మేరకు డిపోల మేనేజర్లకు సమాచారాన్ని పంపించామని అన్నారు. బస్సులు నడవడం ప్రారంభమైన వెంటనే ఆన్ లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు.
APSRTC
TSRTC
Telangana
Andhra Pradesh
Bus

More Telugu News