Du Plesis: ఇతన్ని చూస్తుంటే, చిన్నప్పటి కోహ్లీయే గుర్తొస్తున్నాడు: డూప్లెసిస్
- రుతురాజ్ గైక్వాడ్ పై ఫాఫ్ డూప్లెసిస్ ప్రశంసల వర్షం
- భారత క్రికెట్ జట్టుకు అతను భవిష్యత్ ఆశాకిరణం
- ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో అతనికి తెలుసని వ్యాఖ్య
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో రాణిస్తున్న యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ పై ఫాఫ్ డూప్లెసిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో గెలిచిన తరువాత, మీడియాతో మాట్లాడిన ఆయన, రుతురాజ్ ను చూస్తుంటే, తనకు చిన్నప్పటి విరాట్ కోహ్లీ గుర్తుకు వస్తున్నాడని, భారత క్రికెట్ జట్టుకు అతను భవిష్యత్ ఆశాకిరణమని పొగిడాడు. ఈ మ్యాచ్ లో రుతురాజ్ 62 పరుగులు చేయగా, మరో ఎండ్ లోని డూప్లెసిస్ 48 పరుగులు చేసి, తమ జట్టును విజయ తీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయిన చెన్నై జట్టు, మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా తనతో పాటు పంజాబ్ జట్టు కూడా టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం మాట్లాడిన డూప్లెసిస్, "ఈ సీజన్ మాకు నిరుత్సాహాన్ని అందించింది. అయితే, చివర్లో వరుసగా మూడు విజయాలు సాధించాం. ఈ యువ ఆటగాడు (గైక్వాడ్), చిన్నప్పటి కోహ్లీని గుర్తు చేస్తున్నాడు కదా? ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో అతనికి తెలుసు. క్వాలిటీతో ఆడుతున్నాడు. అతను తప్పకుండా ఎదుగుతాడు" అని వ్యాఖ్యానించాడు. తాను మరో ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడతానన్న నమ్మకం ఉందని డూప్లెసిస్ తెలిపాడు.