Chennai Super Kings: ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... తొలి మ్యాచ్ లో చెన్నై వర్సెస్ పంజాబ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
- ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో పంజాబ్
- ఇరుజట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్
ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడుతున్నాయి. రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఢీకొంటాయి. అబుదాబిలో జరిగే తొలి మ్యాచ్ లో చెన్నై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై, పంజాబ్ జట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్.
ఈ మ్యాచ్ లో గెలిచినా ధోనీ సేనకు ఎలాంటి అవకాశాలు లేవు. పంజాబ్ కు మాత్రం ఈ మ్యాచ్ లో గెలుపు తప్పనిసరి. ఎందుకంటే ప్లేఆఫ్ బెర్తు కోసం అనేక జట్లు కాచుక్కూచున్నాయి. ఒక్క మ్యాచ్ విజయం పలు జట్ల తలరాతల్ని మార్చేస్తుంది. అందుకు నేడు విజయం సాధించి అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ భావిస్తున్నాడు.
ఇక, జట్ల విషయానికొస్తే... పంజాబ్ జట్టులో మయాంక్ అగర్వాల్ పునరాగమనం చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న మయాంక్ జట్టులో చేరడంతో బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం కానుంది. మయాంక్ అగర్వాల్ కోసం అర్షదీప్ ను తప్పించారు. అంతేకాదు, సీనియర్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కు విశ్రాంతి కల్పించారు. అతని స్థానంలో జిమ్మీ నీషామ్ ను తుదిజట్టులోకి తీసుకున్నారు.
అటు, చెన్నై జట్టులోనూ మార్పులు జరిగాయి. వాట్సన్, మిచెల్ శాంట్నర్, కర్ణ్ శర్మ స్థానంలో డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చారు.