Novak Zakovich: జకోవిచ్ కు షాకిచ్చిన అనామకుడు!
- వియన్నాలో టెన్నిస్ పోటీలు
- 42వ సీడ్ చేతిలో సెర్బియా దిగ్గజం ఓటమి
- లక్కీ లూజర్ గా అడుగు పెట్టిన లొరెంజో
వరల్డ్ నంబర్ వన్, 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలుచుకున్న సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ కి ఓ అనామకుడు షాకిచ్చాడు. వియన్నాలో జరుగుతున్న టెన్నిస్ పోటీల్లో 42వ ర్యాంక్ లో ఉన్న ఇటలీ యువ క్రీడాకారుడు లొరెంజో సొనెగో చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్ లో భాగంగా జరిగిన పోరులో కేవలం రెండు సెట్లలోనే జకోవిచ్ ఓటమి పాలుకావడం గమనార్హం.
2005లో ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో తొలి రౌండ్ లోనే నిష్క్రమించిన తరువాత, జకోవిచ్ కు ఎదురైన అత్యంత దారుణ ఓటమి ఇదే కావడం గమనార్హం. ఈ పోరులో జకోవిచ్ 2 - 6, 1 - 6 తేడాతో ఓడిపోయాడు. మొత్తం 15 గేములు జరుగగా, జకోవిచ్ కేవలం మూడు గేమ్ లలో మాత్రమే గెలిచాడు. ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయిన జకోవిచ్ ని చూసి అభిమానులు సైతం నివ్వెరపోయారు.
ఇక ఈ గేమ్ లో ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసేందుకు ఆరు అవకాశాలను జకోవిచ్ చేజార్జుకున్నాడు. ఏస్ లను సంధించడంలోనూ వరల్డ్ నంబర్ వన్ విఫలం అయ్యాడు. ఈ టోర్నీ క్వాలిఫయింగ్ టోర్నీల్లో అర్హత సాధించలేకపోయిన లొరెంజో, అదృష్టం బాగుండి, 'లక్కీ లూజర్'గా అడుగు పెట్టాడు. గతంలో 12 సార్లు ఇలా లక్కీ లూజర్ గా టోర్నీల్లో అవకాశం సంపాదించిన వారితో పోరాడిన జకోవిచ్, మొదటిసారిగా ఓడిపోవడం గమనార్హం.