si Jinping: చైనా మారాల్సిన సమయం వచ్చింది: జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు!
- గత విధానాలు ఇప్పుడు సరిపడవు
- ఇకపై మారాల్సిన సమయం వచ్చింది
- 14వ పంచవర్ష ప్రణాళిక ఆవిష్కరణ
- దేశ పారిశ్రామిక భద్రత కోసమేనన్న జిన్ పింగ్
గతంలో అమలు చేసిన ఆర్థిక అభివృద్ధి విధానాలు చైనాకు ఇప్పుడు సరిపడవని, ఇకపై మారాల్సిన సమయం వచ్చిందని ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా 14వ పంచవర్ష ప్రణాళికను ఆవిష్కరించిన జిన్ పింగ్, ప్రపంచ దేశాలకు చైనా నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులు తగ్గుతున్నాయని అంగీకరించారు. ఇకపై స్వయం నియంత్రిత, రక్షణాత్మక దేశవాళీ ఉత్పత్తి విధానాన్ని ప్రోత్సహిస్తామని, జాతీయ, పారిశ్రామిక భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.
2021 నుంచి 2025 సంవత్సరాల మధ్య చైనా వ్యూహాత్మక విధానాన్ని అభివర్ణించిన ఆయన, చైనాలో తయారయ్యే పలు రకాల ఉత్పత్తులను చైనాలోనే మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని అభివృద్ధి చేస్తామని, విదేశాల నుంచి దిగుమతులను కనిష్ఠానికి చేరుస్తామని అన్నారు. వచ్చే 15 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగడానికి జిన్ పింగ్ కు మార్గం సుగమమైన నేపథ్యంలో, ప్రస్తుతం 67 ఏళ్ల వయసులో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు.
చైనా సైనిక బలం చాలా బలమైందని వ్యాఖ్యానించిన ఆయన, శత్రు దేశాల నుంచి వచ్చే అన్ని రకాల సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, చైనా సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. "మనం గతంలో పాటించిన విధానాలను మార్చుకుంటూ, నూతన పారిశ్రామిక, సాంకేతిక, వినూత్న, దిగుమతి, ఎగుమతి విధానాలను అవలంభించాల్సిన సమయం వచ్చింది. ఇందుకోసం వ్యూహాత్మక సంస్కరణలు అత్యవసరం. ఇదే అత్యుత్తమ క్వాలిటీతో కూడిన అభివృద్ధికి మార్గ నిర్దేశనం చేస్తుంది" అని జిన్ పింగ్ వ్యాఖ్యానించారు.
దిగుమతి విధానంలో ప్రత్యామ్నాయాలను ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, ఎగుమతుల విషయంలోనూ ఇదే విధానాన్ని పాటించాల్సి వుందని అభిప్రాయపడ్డ జిన్ పింగ్, కరోనా మహమ్మారిపై పోరాడేందుకు చైనాకు చెందిన పూర్తి ఇండస్ట్రియల్ చైన్ ముఖ్య భూమికను పోషిస్తోందని, ప్రజారోగ్యం చిక్కుల్లో ఉన్న ఈ సమయంలో సాధ్యమైనంత త్వరగా క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కుతామన్న నమ్మకం తనకుందని ఆయన అన్నారు.