Electric vehicles: ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ రుసుము సున్నా.. నూతన విధానాన్ని ప్రకటించిన తెలంగాణ

telangana govt new policy on electric vehicles

  • ఎలక్ట్రానిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచేందుకు కృషి
  • వచ్చే పదేళ్లపాటు అమల్లోకి నూతన విధానం
  • తయారీ సంస్థలకు, వినియోగదారులకు భారీ రాయితీలు

ఎలక్ట్రానిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కాలుష్య రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రకటించింది. ఉత్పత్తిదారులు, వినియోగదారులకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన సంస్థ (టీఎస్‌రెడ్‌కో)ను నోడల్ ఏజెన్సీగా నియమించింది.

అలాగే, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి నుంచి వచ్చే పదేళ్ల వరకు ఈ నూతన విధానం అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది, తయారీ, వాడకాన్ని ప్రోత్సహించడంతోపాటు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ విధానానికి రూపకల్పన చేసింది.

నూతన విధానంలో భాగంగా రాష్ట్రంలో తయారై అమ్ముడుపోయిన తొలి 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 20 వేల ఆటోలు, 5 వేల నాలుగు చక్రాల వాహనాలు, 10 వేల తేలికపాటి సరకు రవాణా వాహనాలు, 5 వేల కార్లు, 500 బస్సులకు రిజిస్ట్రేషన్ రుసుము, రోడ్డు ట్యాక్స్ వందకు వందశాతం మినహాయింపు లభిస్తుంది. అలాగే, రాష్ట్రంలో కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు కూడా ఈ రెండు ఉచితమే.

కనీసం రూ. 200 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని చేపట్టే భారీ పరిశ్రమలకు రూ. 30 కోట్లకు తగ్గకుండా 20 శాతం పెట్టుబడి రాయితీతోపాటు రూ. 25 కోట్లకు తగ్గకుండా ఏడేళ్లపాటు జీఎస్టీ తిరిగి చెల్లించనున్నారు. అలాగే, ఐదేళ్లపాటు 5 కోట్ల పరిమితితో 25 శాతం విద్యుత్ రాయితీ, రూ. 50 లక్షల పరిమితితో ఐదేళ్లపాటు విద్యుత్ రుసుం పూర్తిగా మినహాయింపు, రూ. 5 కోట్లకు తగ్గకుండా ఐదేళ్లపాటు 60 శాతం రవాణా రుసుం, 5 కోట్లకు తగ్గకుండా 5.25 శాతం వడ్డీ రాయితీ ఇవ్వనుంది.

ప్రభుత్వం ఇప్పటికే రావిర్యాల, మహేశ్వరంలలో ఎలక్ట్రానిక్ తయారీ జోన్, దివిటిపల్లి వద్ద ఇంధన నిల్వ తయారీ పరికరాల జోన్‌ను ఏర్పాటు చేస్తోంది. బ్యాటరీలు వాటికి సంబంధించిన పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాల అనుబంధ పరికరాల తయారీకి రాయితీలు ఇవ్వనుంది. ఆటోలకు ఫిట్‌మెంట్ రాయితీ కూడా లభించనుంది.

హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని విమానాశ్రయాలు, రైల్వే, మెట్రో స్టేషన్లు, పార్కింగ్ స్థలాలు, బస్ డిపోలు, మార్కెట్లు, పెట్రోలు బంకులు, మాల్స్ తదితర ప్రాంతాల్లో చార్జింగ్ కేంద్రాల స్థాపనకు రెడ్‌కో కృషి చేస్తుంది. పెద్ద నగరాలకు దారితీసే జాతీయ రహదారులపై ప్రతీ 50 కిలోమీటర్లకు ఓ చార్జింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Electric vehicles
Telangana
New policy
  • Loading...

More Telugu News