kolkata knightriders: చెన్నై చేతిలో ఓడిన కోల్‌కతా.. ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టం

kolkata defeated by chennai super kings
  • గైక్వాడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ మ్యాచ్’
  • చివరి రెండు బంతులకు సిక్సర్లు కొట్టి విజయాన్ని అందించిన జడేజా
  • ఓటమితో కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు!
ప్లే ఆఫ్స్‌కు దూరమై నామమాత్రపు మ్యాచ్‌లు ఆడుతున్న చెన్నై ఉపయోగం లేని మ్యాచుల్లో చెలరేగిపోతోంది. వరుస విజయాలు సాధిస్తూ ఇతర జట్ల ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చిలకరిస్తోంది. మొన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించిన చెన్నై.. గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఒకవిధంగా ఈ విజయం చెన్నైకి ఊరటే. కానీ కోల్‌కతాకు మాత్రం భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. కోల్‌కతాకు మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా, పంజాబ్‌కు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ రెండింటిలోనూ విజయం సాధిస్తే ఆ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. అప్పుడు తర్వాతి మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించినప్పటికీ ఫలితం ఉండదు.

నిన్నటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నితీశ్ రాణా మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై చివరి బంతికి విజయాన్ని అందుకుంది. వాట్సాన్ 14 పరుగులకే అవుటైనప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ మరోమారు చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక రాయుడు 38, శామ్ కరన్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. చివరి రెండు బంతులకు చెన్నై విజయానికి ఏడు పరుగులు అవసరమైన వేళ రవీంద్ర జడేజా వరుస సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు. 11 బంతులు మాత్రమే ఎదుర్కొన్న జడేజా 2 ఫోర్లు, 3  సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. 72 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించిన గైక్వాడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

అంతకుముందు కోల్‌కతా ధాటిగా ఆడింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 26, నరైన్ 7, ఆర్‌కే సింగ్ 11, మోర్గాన్ 15, కార్తీక్ 21(నాటౌట్), రాహుల్ త్రిపాఠి 3 (నాటౌట్) పరుగులు చేశారు. సహచరులందరూ క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరుగుతున్నా క్రీజులో పాతుకుపోయిన నితీశ్ రాణా చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడడంతో కోల్‌కతా భారీ స్కోరు చేయగలిగింది. 61 బంతులు ఆడిన రాణా 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు.
kolkata knightriders
chennai super kings
ruturaj gaikwad
IPL 2020

More Telugu News