Fawad Hussain Chaudhry: పుల్వామా దాడి మా పనే.... పాక్ పార్లమెంటులో మంత్రి సంచలన వ్యాఖ్యలు

Pakistan minister Fawad Hussain Chaudhry claims Pulwama terror attack a success of their government

  • గతేడాది పుల్వామాలో ఉగ్రదాడి
  • 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల వీరమరణం
  • అది తమ ప్రభుత్వ విజయం అన్న పాక్ మంత్రి ఫవాద్ చౌదరి

గతేడాది ఫిబ్రవరి 14న కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందడం తెలిసిందే. ఆ దాడితో యావత్ భారతం రగిలిపోయింది. ఆనాటి ఉగ్రదాడి పాక్ ప్రోద్బలిత దాడి అన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా, ఇప్పుడు ఆ దాడిపై పాకిస్థాన్ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి పార్లమెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.

పుల్వామా దాడి తమ పనే అని ఫవాద్ చౌదరి విస్పష్టంగా ప్రకటించారు. భారత్ ను వారి సొంతగడ్డపైనే దారుణంగా దెబ్బకొట్టామని, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో సాధించిన ఈ విజయం పాక్ ప్రజల విజయం అని అభివర్ణించారు. ఈ విజయంలో యావత్ పాక్ కు భాగస్వామ్యం ఉందని గొప్పగా చెప్పుకున్నారు. ఆయన ప్రసంగానికి కొందరు పార్లమెంటు సభ్యులు బల్లలు చరుస్తూ తమ హర్షం వెలిబుచ్చారు. ఫవాద్ చౌదరి వ్యాఖ్యల వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

పాక్ నిజస్వరూపాన్ని ఇప్పటికైనా ప్రపంచం తెలుసుకోవాలి: భారత్

పుల్వామా దాడి ఘటన వెనుక ఉన్నది తామేనని పాక్ మంత్రి ప్రకటించడం పట్ల భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్ ను క్షమించరాదని, పాక్ నిజస్వరూపం ఎలాంటిదో ప్రపంచం ఇప్పటికైనా గ్రహించాలని పేర్కొంది. పుల్వామా దాడి వెనుక ఉన్న సూత్రధారులం తామేనని పాక్ ఇప్పుడు బహిరంగంగానే సమర్థించుకుంటోందని వెల్లడించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News