jee: మరొకరితో పరీక్ష రాయించి జేఈఈ టాపర్‌గా నిలిచిన అభ్యర్థి.. పోలీసుల దర్యాప్తులో తేలుతోన్న షాకింగ్ విషయాలు!

JEE Mains Topper In Assam Arrested Allegedly Used Proxy For Exam

  • అసోం నుంచి టాపర్‌గా నిలిచిన నీల్ నక్షత్ర దాస్
  • 99.8 శాతం మార్కులు సాధించిన వైనం
  • గుర్తించి ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి
  • కూపీలాగితే కుంభకోణం బయటపడుతోన్న వైనం
  • మరొకొన్ని కేసులూ వెలుగులోకొచ్చే అవకాశం

ఐఐటీలతో పాటు భారత్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల కోసం నిర్వహించే  జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (మెయిన్స్)లో మరో వ్యక్తితో పరీక్ష రాయించి అసోం నుంచి టాపర్‌గా నిలిచిన నీల్ నక్షత్ర దాస్‌తో పాటు అతడి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.

 ఆ పరీక్షలో నీల్ నక్షత్ర దాస్ 99.8 శాతం మార్కులతో టాపర్‌గా‌ నిలిచాడు. ఈ పరీక్షలను అతడు మరొకరి చేత రాయించినట్లు ఆరోపణలు రావడంతో అసోంలోని అజారా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ఆ అభ్యర్థితో పాటు అతడి తండ్రి డాక్టర్ జోతిర్మయి దాస్‌లను స్థానిక కోర్టులో పోలీసులు ఈ రోజు హాజరుపర్చనున్నారు.

పరీక్ష రాయకుండానే  తన కుమారుడు నక్షత్ర దాస్ ర్యాంకు సాధించేలా అతడి తండ్రి జోతిర్మయి దాస్ ప్లాం చేశాడు. జేఈఈ పరీక్ష కేంద్రం నిర్వాహకులు హేమేంద్రనాథ్‌ శర్మ, ప్రాంజల్‌ కలితా, హీరూలాల్‌ పాఠక్‌ తో సంప్రదింపులు జరిపి లంచం ఇవ్వడంతో అతడి బదులు మరొకరు పరీక్ష రాసేందుకు వారంతా సాయపడ్డారని పోలీసుల విచారణలో బయటపడింది.

ఇందుకోసం తండ్రి జ్యోతిర్మయి దాస్‌ రూ.20 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. నక్షత్ర దాస్ తండ్రికి, పరీక్ష కేంద్ర నిర్వాహకులకు మధ్య ఓ ఏజెన్సీకి చెందిన వారు మధ్యవర్తిత్వం చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ కేసులో మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

దీని వెనుక పెద్ద కుంభకోణమూ ఉన్నట్లు తమకు తెలుస్తోందని, ఈ ఒక్క కేసే కాకుండా మరికొన్ని ఇటువంటి కేసులూ బయటపడే అవకాశం ఉందని అన్నారు. అన్ని కోణాల్లోనూ తాము విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. పరీక్ష జరిగిన రోజు ఇన్విజిలేటర్ సాయంతో నక్షత్ర దాస్ పరీక్ష హాలులోకి వెళ్లి, రోల్ నంబరు రాసి, సంతకం చేసి బయటకు వెళ్లిపోగా, అనంతరం వెంటనే ఆ పరీక్షను మరొకరు రాసినట్లు పోలీసులు తేల్చారు.

కాగా, తన పరీక్షకు సంబంధించి నక్షత్రదాస్ ఫోనులో, వాట్సాప్ చాటింగ్ లో పలు వివరాలను మరొకరితో మాట్లాడాడు. ఈ విషయాన్ని గుర్తించిన మిత్ర దేవ్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు, నక్షత్రదాస్ పరీక్ష రాసిన కేంద్రాన్ని ఇప్పటికే సీల్ చేసి, మేనేజ్ మెంట్ కు పోలీసులు సమన్లు పంపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News