France: ఫ్రాన్స్‌లో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా.. మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించిన అధ్యక్షుడు
- ఫ్రాన్స్‌లో మొదలైన రెండో దశ వ్యాప్తి
- అత్యవసరాలు మినహా మిగతావన్నీ బంద్
- ఇంటి నుంచి బయటకు రావాలన్నా అనుమతి తప్పనిసరన్న అధ్యక్షుడు
దేశంలో కరోనా వైరస్ మరోమారు చెలరేగిపోతుండడంతో ఫ్రాన్స్ మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించింది. పరిస్థితి చేయి దాటకముందే చర్యలు చేపట్టాలని భావించిన ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిన్న దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించారు. డిసెంబరు 1 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మొదలైందని, మొదటి దశ కంటే ఇది మరింత ప్రమాదకరంగా ఉంటుందని, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నేటి రాత్రి నుంచి బార్లు, రెస్టారెంట్లు, అత్యవసరాలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసివేయాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి రాతపూర్వక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా జాగ్రత్త పడకుంటే 4 లక్షలకు పైగా మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే నెల 15 నాటికి దాదాపు 9 వేల మందికి ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉందన్నారు.
రెండో దశ ప్రారంభం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో రెండు వారాల క్రితమే పారిస్ సహా ఇతర ప్రధాన పట్టణాల్లో కర్ఫ్యూ విధించినా సెకెండ్ వేవ్‌ను కట్టడి చేయలేకపోయామని మాక్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దశలో ఇప్పటికే 35 వేలకు పైగా మరణాలు నమోదైనట్టు చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే రెండు వారాల్లో మహమ్మారి వ్యాప్తి నెమ్మదిస్తే సడలింపులు ఇస్తామని మాక్రాన్ స్పష్టం చేశారు.