Nimmagadda Ramesh: వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదు: నిమ్మగడ్డ రమేశ్
- కరోనా పరిస్థితిపై ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చలు జరిపాం
- సీఎస్ తో కూడా చర్చించాం
- పార్టీల అభిప్రాయాలను గౌరవిస్తాం
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల నిర్వహణపై ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించలేదని వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనల్లో నిజం లేదని చెప్పారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్యారోగ్యశాఖ కమిషనర్ లతో చర్చలు జరిపామని తెలిపారు. చీఫ్ సెక్రటరీ నుంచి కూడా సలహాలు తీసుకున్నామని చెప్పారు.
సమావేశానికి 11 పార్టీలు హాజరయ్యాయని, 6 పార్టీలు హాజరుకాలేదని, 2 పార్టీలు లిఖితపూర్వకంగా సమాధానాలను పంపాయని రమేశ్ తెలిపారు. రాజకీయ పార్టీల గుర్తింపు విషయంలో సీఈసీ నిబంధనలను అనుసరించామని చెప్పారు. సమావేశం సందర్భంగా పార్టీల నుంచి వచ్చిన అభిప్రాయాలను గౌరవిస్తామని తెలిపారు.