Jagan: రైతుల ఖాతాలకు రూ.1,114 కోట్ల నగదు బదిలీ.. రైతు భరోసా సాయాన్ని ప్రారంభించిన జగన్
- తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభం
- మొత్తం 50.07 లక్షల మంది రైతులకు లబ్ధి
- 41,000 అటవీ భూముల సాగుదార్లకు కూడా సాయం
- ఏపీలోని ప్రతి 3 కుటుంబాల్లో ఒక కుటుంబానికి సాయం
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ రైతు భరోసా రెండవ విడత పెట్టుబడి సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు రూ.1,114 కోట్ల నగదును బదిలీ చేశారు. మొత్తం 50.07 లక్షల మంది రైతులు
దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. తాము 41,000 అటవీ భూముల సాగుదార్లకు కూడా సాయం అందిస్తున్నామని, ఏపీలోని ప్రతి 3 కుటుంబాల్లో ఒక కుటుంబానికి సాయం అందుతోందని చెప్పారు.
రైతు భరోసా రెండో విడతలో రైతులకు రూ.2 వేల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. ఈ నెల 2న ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు అందించిన గిరిజనులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని, వారికి రూ.11,500 చొప్పున జమ చేస్తున్నామని తెలిపారు. అలాగే, పంట నష్టపోయిన సీజన్‌లోనే పరిహారం ఇవ్వడం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ప్రతి లబ్ధిదారుడికి సాయం అందిస్తున్నామని తెలిపారు.