america: భారత్-అమెరికా మధ్య నేడు రక్షణ రంగంలో కీలక ఒప్పందం
- నిన్న భారత్ చేరుకున్న అమెరికా రక్షణ, విదేశాంగశాఖ మంత్రులు
- నేడు 2 ప్లస్ 2 చర్చలు ప్రారంభం
- ఇరు దేశాల మధ్య బీఈసీఏ ఒప్పందం
భారత్, అమెరికా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మార్క్ టి ఎస్పర్ మధ్య నిన్న రక్షణ రంగానికి సంబంధించిన కీలక చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా నేడు అతి ముఖ్యమైన ఒప్పందం జరగనుంది. అమెరికా నుంచి అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ బదిలీ, ఇరు దేశాల మధ్య సరఫరా వ్యవస్థ, భూభౌగోళిక చిత్రాల వినియోగానికి సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు నేడు సంతకాలు చేయనున్నాయి. నిన్న జరిగిన చర్చల్లో రక్షణ రంగం సహా వ్యూహాత్మక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, సైనిక సహకారం వంటి వాటిపై చర్చించారు.
అలాగే, చైనాతో ప్రస్తుతం నెలకొన్న సరిహద్దు వివాదం గురించి కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. భారత్-అమెరికా మధ్య ‘బేసిక్ ఎక్స్‌చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బీఈసీఏ) ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరువురు మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోల మధ్య కూడా నిన్న చర్చలు జరిగాయి.
చర్చల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ బధౌరియా, డీఆర్‌డీఓ చైర్మన్ సతీశ్ రెడ్డి తదితరులు ఉన్నారు. భారత్-అమెరికాల మధ్య నేడు ప్రారంభం కానున్న 2 ప్లస్ 2 చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, విదేశాంగ మంత్రి మైక్ పాంపియోలు నిన్ననే భారత్ చేరుకున్నారు.