gitam university: అక్రమ నిర్మాణాలంటూ.. విశాఖ గీతం విశ్వవిద్యాలయం కట్టడాలను కూల్చేస్తున్న జీవీఎంసీ అధికారులు
- ప్రధాన ద్వారం, ప్రహరీ, సెక్యూరిటీ సిబ్బంది రూములను కూల్చేసిన అధికారులు
- ముందస్తు నోటీసులు ఇవ్వలేదంటున్న వర్సిటీ యాజమాన్యం
- యూనివర్సిటీ వద్దకు చేరుకుంటున్న టీడీపీ శ్రేణులు
విశాఖపట్టణంలోని గీతం విశ్వవిద్యాలయంలోని కొన్ని కట్టడాలను గ్రేటర్ విశాఖ మునిసిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన ద్వారం, భద్రతా సిబ్బంది గదులు, ప్రహరీలో కొంతభాగాన్ని కూల్చివేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టారన్న ఆరోపణలతో జీవీఎంసీ అధికారులు వీటిని తొలగిస్తుండగా, ఎందుకు కూల్చుతున్నారో తమకు చెప్పడం లేదని, కూల్చివేతకు ముందు నోటీసులు కూడా ఇవ్వలేదని గీతం యాజమాన్యం పేర్కొంది. కూల్చివేత సందర్భంగా వర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విశ్వవిద్యాలయం లోపలికి వెళ్లే మార్గాన్ని రెండు వైపుల నుంచి మూసివేశారు. మరోవైపు, కూల్చివేత సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వర్సిటీ వద్దకు చేరుకుంటున్నాయి.