APSRTC: మరింత దిగిన ఏపీఎస్ ఆర్టీసీ... ఇక తెలంగాణ ఓకే అంటే తక్షణం బస్సులు!
- టీఎస్ విధించిన అన్ని నిబంధనలకూ అంగీకరించాం
- రెండు రాష్ట్రాల ఆర్టీసీలూ నష్టపోరాదనే ఆలోచించాం
- వెల్లడించిన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించే విషయంలో టీఎస్ ఆర్టీసీ పెట్టిన అన్ని నిబంధనలకూ ఏపీఎస్ ఆర్టీసీ అంగీకరించింది. తొలుత తాము తగ్గించుకున్నంత మేరకు, తెలంగాణ బస్సు సర్వీసులను పెంచుకోవాలని కోరిన ఏపీ, అందుకు తెలంగాణ ఏ మాత్రమూ అంగీకరించకపోయేసరికి ఇప్పుడు మరిన్ని మెట్లు దిగి వచ్చింది. పండగ సీజన్ సమయంలో బస్సులు నడిపించకుంటే, రెండురాష్ట్రాల ఆర్టీసీలూ తీవ్రంగా నష్టపోతాయన్న ఉద్దేశంతో, ఏపీకి నష్టం అధికంగా జరుగుతుందని తెలిసినా కిలోమీటర్లను పూర్తిగా తగ్గించుకునేందుకు అంగీకరించింది.
ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు, తెలంగాణ అధికారులు కోరిన అన్ని ప్రతిపాదనలకూ తాము సానుకూలంగా ఉన్నామని ప్రకటించారు. టీఎస్ అభ్యంతరాలతో ఏపీకి నష్టం ఎక్కువే అయినప్పటికీ, ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు. టీఎస్ కోరినట్టుగా రూట్ల వారీగా క్లారిటీ కూడా ఇచ్చామని, తుది ప్రతిపాదనలను గత వారంలోనే పంపామని, టీఎస్ స్పందన కోసం వేచి చూస్తున్నామని అన్నారు.
కాగా, తెలంగాణలో మొన్నటివరకు ఏపీ బస్సులు 2.61 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ ఉండగా, ఏపీలో టీఎస్ బస్సులు 1.61 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఈ వ్యత్యాసాన్ని లేకుండా చేయాలని తెలంగాణ పట్టుపట్టింది. ఈ విషయంలో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు సాగాయి. అయినా ఫలవంతం కాలేదు. పండగ నేపథ్యంలో వీలైనంత త్వరగా బస్సులను తిప్పాలని, లేకుంటే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలో ఉన్న ఏపీ, అన్ని మెట్లూ దిగి రావడంతో, నేడో, రేపో బస్సు సర్వీసులకు పచ్చజెండా ఊపుతారని తెలుస్తోంది.