China: భారత జవాన్లకు పట్టుబడిన చైనా సైనికుని వద్ద ఏముందంటే... వెల్లడించిన ఆర్మీ అధికారి!
- ఇటీవల డెమ్ చోక్ ప్రాంతంలో పట్టుబడిన చైనా సైనికుడు
- స్టోరేజ్ డివైస్, మొబైల్, ఐడీ కార్డు
- ఆక్సిజన్ కూడా తెచ్చుకున్నాడన్న ఉన్నతాధికారులు
ఇటీవల డెమ్ చోక్ ప్రాంతంలో భారత జవాన్లకు ఓ చైనా సైనికుడు పట్టుబడగా, అతన్ని తిరిగి చైనాకు అప్పగించిన సంగతి తెలిసిందే. తూర్పు లడఖ్ సమీపంలో సరిహద్దులు దాటి వచ్చిన ఇతను, భారత జవాన్ల కంటపడ్డాడు. ఇతని వద్ద స్లీపింగ్ బ్యాగ్, డేటా స్టోరేజ్ పరికరంతో పాటు మొబైల్ ఫోన్, మిలిటరీ గుర్తింపు కార్డు ఉన్నాయని సైనికాధికారి ఒకరు తెలిపారు.
చుషుల్ సమీపంలో జరిగిన సరిహద్దు భద్రతా దళాల సమావేశంలో అతన్ని చైనాకు అప్పగించామని, అంతకుముందు అతన్ని అణువణువూ సోదా చేశామని అన్నారు. అతన్ని ప్రశ్నించామని కూడా తెలిపారు. ఇండియాలో, ముఖ్యంగా హిమాలయాల్లోని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఆక్సిజన్, ఆహారం, వెచ్చదనాన్ని కలిగించే దుస్తులు కూడా అతని వద్ద దొరికాయని తెలిపారు.