Nagarjuna: 'వైల్డ్ డాగ్' షూటింగ్ కోసం హిమాలయాల్లో నాగార్జున.. అక్కడి నుంచి వీడియో విడుదల!
- రోహ్ టాంగ్ పాస్ లో షూటింగ్ చేస్తున్నట్టు వెల్లడి
- 21 రోజుల పాటు చిత్రీకరణ జరగనుందని వివరణ
- అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్' చిత్రం
టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున నటిస్తున్న 'వైల్డ్ డాగ్' చిత్రం తాజా షెడ్యూల్ హియాలయ పర్వత ప్రాంతాల్లో జరుగుతోంది. 'వైల్డ్ డాగ్' షూటింగ్ కోసం రోహ్ టాంగ్ పాస్ ప్రాంతానికి వెళ్లినట్టు నాగ్ స్వయంగా వెల్లడించారు. తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియో పోస్టు చేశారు.
సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తున ఉన్న రోహ్ టాంగ్ పాస్ లో ఉన్నానని, ప్రస్తుతం ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉందని నాగ్ వెల్లడించారు. నవంబరు నుంచి మే నెల వరకు ఇక్కడి వాతావరణం ఎంతో ప్రమాదకరంగా ఉంటుందని, అందుకే ఈ ప్రాంతాన్ని మూసివేస్తారని వివరించారు. 'వైల్డ్ డాగ్' షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చామని, ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో చిత్రీకరణ సాగుతోందని తెలిపారు. నీలాకాశం, ఎత్తయిన పర్వతాలు, సరస్సులతో ఎంతో అందంగా ఉన్న ప్రదేశంలో షూటింగ్ చేస్తున్నామని, 7 నెలల తర్వాత షూటింగ్ లో పాల్గొంటుండడం ఆనందంగా ఉందని అన్నారు. 21 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందని వెల్లడించారు.
అయితే, నాగ్ బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇకపై ఆయన కొనసాగడంపై స్పష్టతలేదు. దీనిపై స్టార్ మా చానల్ వెల్లడించాల్సిందే! కాగా, వైల్డ్ డాగ్ చిత్రం ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి అహిషోర్ సాల్మన్ దర్శకుడు.