JEE Exams: మాతృభాషలకు మరింత ప్రాధాన్యత.. జేఈఈ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయం!
- జాతీయ విద్యా విధానం కింద నిర్ణయం
- తాము ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదన్న మంత్రి
- 22 భాషలను బలోపేతం చేస్తామని స్పష్టీకరణ
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ (మెయిన్స్) పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు నిర్ణయించినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. కొత్త జాతీయ విద్యా విధానం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రాంతీయ భాషల్లో నిర్వహించే పరీక్ష ఆధారంగా రాష్ట్ర ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పిస్తామని తెలిపారు.
పీఐఎస్ఏ పరీక్షల్లో అత్యధిక మార్కులు తెచ్చుకుంటున్న దేశాలు బోధనా మాధ్యమంగా మాతృభాషను ఉపయోగిస్తున్నాయని ఇటీవల ప్రధాని మోదీ చెప్పారని... ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. మాతృభాషలో పరీక్షను నిర్వహిస్తే... ప్రశ్నను అవగాహన చేసుకోవడం విద్యార్థులకు సులభమవుతుందని, మెరుగైన మార్కులు సాధించేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. తాము ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదని... ఏ రాష్ట్రంపైనా, ఏ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం తాము చేయబోమని చెప్పారు. 22 భారతీయ భాషలను బలోపేతం చేయడానికి తాము సానుకూలంగా ఉన్నామని తెలిపారు.