Landslide: సీఎం జగన్ పర్యటనకు ముందు అపశ్రుతి... ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు
- సాయంత్రం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
- వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలు
- తొలగింపజేస్తున్న పోలీసులు, అధికారులు
ఏపీలో గత కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలకు బాగా నానిపోవడంతో మట్టి కరిగిపోయి పెద్ద బండరాళ్లు, మట్టి కిందికి పడ్డాయి. సీఎం జగన్ ఈ సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉండగా, అందుకు కొన్ని గంటల ముందు ఈ ఘటన జరిగింది.
సీఎం పర్యటన నేపథ్యంలో ఈ కొండచరియలు విరిగిపడడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. సీఎం జగన్ వస్తున్నారన్న కారణంతో భక్తుల రాకను తాత్కాలికంగా నిలిపివేశారు. లేకుంటే భారీ నష్టం జరిగి ఉండేదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కాగా, ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, ఇతర అధికారులు కొండచరియలను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మీడియా పాయింట్ కు సమీపంలోనే ఈ కొండచరియలు విరిగిపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో కొన్ని షెడ్లు కూలిపోగా, కొందరికి స్వల్ప గాయాలు తగిలినట్టు సమాచారం.