Mahabubabad District: మూడు రోజులైనా దొరకని కిడ్నాపైన బాలుడి ఆచూకీ.. తండ్రి స్నేహితులపైనే అనుమానం

no clue in mahabubabad boy kidnap case

  • వీడియో జర్నలిస్ట్ కుమారుడిని కిడ్నాప్ చేసిన దుండగులు
  • తెలిసిన వ్యక్తులు కావడంతో బాబు వారి బైక్ ఎక్కి ఉంటాడని అనుమానం
  • నేడు మళ్లీ చేస్తామన్న కిడ్నాపర్లు

మహబూబాబాద్‌లో సంచలనం సృష్టించిన వీడియో జర్నలిస్ట్ కుమారుడు దీక్షిత్ (9) కిడ్నాప్ కేసులో ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ తల్లిదండ్రుల్లో  ఆందోళన మరింత ఎక్కువవుతోంది. కిడ్నాపర్లు ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేస్తుండడంతో వారిని ట్రేస్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిని ఆదివారం సాయంత్రం కిడ్నాప్ చేసిన దుండగులు రూ. 45 లక్షలు డిమాండ్ చేశారు.

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేసిన కిడ్నాపర్లు నిన్న రాత్రి 8 గంటలకు మరోమారు ఫోన్ చేసి డబ్బులు సిద్ధం చేసుకున్నారా? అని ప్రశ్నించారు. బుధవారం మరోమారు ఫోన్ చేస్తామని చెప్పి ఫోన్ పెట్టేశారు. కిడ్నాపర్ల నుంచి వస్తున్న ఫోన్ కాల్‌ను ట్రాక్ చేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల సైబర్ క్రైం నిపుణుల బృందం నిన్న పట్టణంలోని పలు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు.

అయితే, ఈ కిడ్నాప్ వెనక తెలిసిన వ్యక్తులే ఉన్నారని బాలుడి తండ్రి రంజిత్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఐదుగురి పేర్లను చెప్పినట్టు సమాచారం. కిడ్నాపర్లను తనతో చూసి ఉండడం వల్లే వారు పిలవగానే దీక్షిత్ వారితో వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు బాలుడి తల్లిదండ్రులకు ఆదివారం రాత్రి ఫోన్ చేసిన కిడ్నాపర్లు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం కూడా తమకు తెలుసని, మీ ప్రతీ కదలికా తమకు తెలుసని చెప్పారు. దీంతో స్థానికంగా ఉన్న పది మందిని పోలీసులు నిన్న మరోమారు విచారించారు.

కిడ్నాపర్ల బైక్ ఎక్కడానికి ముందు దీక్షిత్ తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. దీంతో కొందరి అనుమానితుల ఫొటోలను దీక్షిత్ స్నేహితులకు చూపించగా వారు కాదని చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు, కిడ్నాపర్లు డిమాండ్ చేసిన మొత్తం తమ వద్ద లేదని, ఎంతో కొంత ఇస్తామని, బాబును క్షేమంగా విడిచిపెడితే కేసును కూడా వెనక్కి తీసుకుంటామని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు.

  • Loading...

More Telugu News