Narendra Modi: మన జాగ్రత్తలు, సంప్రదాయాలే కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించాయి: మోదీ

PM Modi speech towards nation

  • దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోందని వెల్లడి
  • ముప్పు ఇంకా తొలగిపోలేదని స్పష్టీకరణ
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఉద్ఘాటన
  • ముందు నిలిచి పోరాడుతున్న వారికి కృతజ్ఞతలు

ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ కరోనాతో పోరాటం చేస్తోందని అన్నారు. అయితే, మన జాగ్రత్తలు, మన సంప్రదాయాలే కరోనా ప్రభావాన్ని గణనీయంగా తగ్గించేందుకు కారణమయ్యాయని తెలిపారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి సంపన్న దేశాలు సైతం కరోనా వైరస్ పట్ల అజాగ్రత్తగా వ్యవహరించి మూల్యం చెల్లించాయని అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా కారక మరణాల రేటు తక్కువగా ఉందని వెల్లడించారు. అగ్రదేశాలతో పోల్చితే మనదేశంలో కరోనా మరణాల రేటు తక్కువ అని వెల్లడించారు.

ప్రతి 10 లక్షలమందిలో ఐదున్నర వేలమందికే కరోనా వచ్చిందని, 10 లక్షల కేసులకు 83 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయని తెలిపారు. కరోనా రక్కసిని ఎదుర్కోవడంలో పెద్ద దేశాల కంటే భారత్ మెరుగ్గా ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. రికవరీ రేటు కూడా భారత్ లో అధికంగానే ఉందని చెప్పుకొచ్చారు. కరోనా టెస్టింగ్ లే భారత్ చేతిలో ఉన్న ఆయుధమని, వీలైనంత ఎక్కువగా పరీక్షలు చేసి ముందుగానే రోగులను గుర్తించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులను నివారించగలిగామని చెప్పారు.

కరోనా తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కుదుటపడుతోందని వివరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగనిద్దాం అని అన్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల కృషితోనే  దేశంలో కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిందని చెబుతూ ముందు నిలిచిపోరాడుతున్న వారిని కొనియాడారు. దేశంలో 90 లక్షల బెడ్లు అందుబాటులో ఉన్నాయని, వైద్యం కోసం ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మోదీ స్పష్టం చేశారు. దేశం ఇప్పుడిప్పుడే విపత్కర పరిస్థితులను అధిగమిస్తోందని పేర్కొన్నారు.

అయితే, భారత్ కు ఇంకా ముప్పు తొలగిపోలేదని, రాబోయేది పండుగల సీజన్ కావడంతో పెనుగండం పొంచి ఉందని భావించాలని స్పష్టం చేశారు. కరోనా ఇంకా వెంటాడుతూనే ఉందన్న విషయం మర్చిపోవద్దని అన్నారు. పండుగ సీజన్ వచ్చిందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం ఎక్కువగా జరుగుతుంటుందని తెలిపారు. ఇలాంటి సమయాల్లోనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అమెరికా, యూరప్ దేశాల్లో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోందని, మనకు అలాంటి పరిస్థితి రాకూడదని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. మాస్కులు లేకుండా బయట తిరిగి ప్రమాదం కొనితెచ్చుకోవద్దని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు అప్రమత్తతే రక్ష అని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ప్రజలందరికీ అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

Narendra Modi
Speech
Nation
Corona Virus
India
  • Loading...

More Telugu News