Chiranjeevi: హైదరాబాద్ వరద బాధితుల కోసం భారీ విరాళాలు ప్రకటించిన చిరంజీవి, మహేశ్ బాబు
- హైదరాబాద్ లో వర్ష విలయం
- పోటెత్తిన వరదలు
- నీట మునిగిన నగరం
- ఉదారంగా స్పందించిన టాలీవుడ్
గత వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత వర్ష బీభత్సంతో హైదరాబాద్ నగరం తల్లడిల్లిపోయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటించారు. చిరంజీవి, మహేశ్ బాబు కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. శతాబ్ద కాలంగా ఎప్పుడూలేనంత భారీ వర్షాలు హైదరాబాద్ ను అతలాకుతలం చేశాయని, భారీగా ప్రాణనష్టం జరిగిందని చిరంజీవి ట్విట్టర్ లో తెలిపారు.
ప్రకృతి విలయం కారణంగా నష్టపోయిన వారి పట్ల తన హృదయం ద్రవించిపోతోందని తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి రూ.1 కోటి విరాళం ఇస్తున్నానని చిరంజీవి ప్రకటించారు. ఈ విపత్కర సమయంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఊహించలేనంత విలయం జరిగింది: మహేశ్ బాబు
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలతో ఊహించనలవి కాని విలయం చోటుచేసుకుందని మహేశ్ బాబు అన్నారు. వరద ప్రభావిత కుటుంబాలను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ చేపడుతున్న చర్యలు అభినందనీయం అని ట్వీట్ చేశారు. ఈ కష్టకాలంలో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.1 కోటి విరాళం ఇస్తున్నానని మహేశ్ బాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వీలైనంతగా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కష్టకాలంలో మన ప్రజలకు మనందరం అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.