Tamilnadu: వరద ప్రభావిత హైదరాబాదుకు రూ.10 కోట్ల సాయం ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం
- హైదరాబాదుకు భారీ వరదలు
- స్పందించిన తమిళనాడు సీఎం పళనిస్వామి
- సీఎం కేసీఆర్ కు లేఖ
ఇంతటి బీభత్సాన్ని తామెప్పుడూ చూడలేదని హైదరాబాద్ వాసులు భీతిల్లిపోయేలా సంభవించిన వరదలు తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా కదిలించాయి. వరద ప్రభావంతో అస్తవ్యస్తంగా మారిన హైదరాబాదును ఆదుకునేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించింది. తమిళనాడు సీఎం సహాయనిధి నుంచి రూ.10 కోట్ల మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వానికి విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సీఎం ఎడప్పాడి పళనిస్వామి తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.
భారీ వర్షాలు హైదరాబాదు నగరంతో పాటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాలను కూడా ముంచెత్తాయని, ఈ కారణంగా తీవ్ర ఆస్తినష్టం జరగడంతో పాటు, కొందరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటూ పళనిస్వామి సంతాపం ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం తరఫున సానుభూతి తెలుపుకుంటున్నట్టు వివరించారు. ఈ కష్టకాలంలో తమిళనాడు ప్రభుత్వం, తమిళ ప్రజల తరఫున తెలంగాణ ప్రభుత్వానికి సాయపడాలన్న ఉద్దేశంతో రూ.10 కోట్ల సాయం అందజేతకు ఆదేశాలు జారీ చేశానని పళనిస్వామి తన లేఖలో పేర్కొన్నారు.
అంతేకాకుండా, వరద బాధిత కుటుంబాలకు దుప్పట్లు, చాపలు పంపిస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కోరితే ఎలాంటి సాయం అందించేందుకైనా తమిళనాడు సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ కు స్పష్టం చేశారు.