PLA Soldier: లడఖ్ వద్ద భారత భద్రతా బలగాలకు పట్టుబడిన చైనా సైనికుడు

China PLA soldier captured by Indian army at Ladakh
  • ఎల్ఏసీ వద్ద తిరుగాడుతున్న చైనా సైనికుడు
  • వైద్య సహాయం అందించి, ఆహారం సమకూర్చిన భారత సైన్యం
  • సైనికుడ్ని తిరిగి చైనాకు అప్పగించనున్న భారత్
గత కొన్నినెలలుగా లడఖ్ వద్ద భారత్-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గాల్వన్ లోయ వద్ద ఘర్షణల్లో ప్రాణనష్టం జరిగిన దరిమిలా ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో లడఖ్ లోని చుమార్-దెంచోక్ ప్రాంతంలో ఓ చైనా సైనికుడ్ని భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ మేరకు సైన్యం ఓ ప్రకటన చేసింది. అతడ్ని కార్పొరల్ వాంగ్ యా లాంగ్ గా గుర్తించారు.

ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు ఒప్పందాల్లో భాగంగా ఆ కార్పొరల్ ను చైనాకు అప్పగించనున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద తిరుగాడుతున్న ఆ చైనా సైనికుడు ఈ ఉదయం భారత సైన్యానికి పట్టుబడ్డాడు. అతడి పరిస్థితి గమనించిన భారత జవాన్లు వెంటనే వైద్య సహాయం అందించి, ఆహారంతో పాటు వెచ్చని దుస్తులు సమకూర్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడడంతో ఆక్సిజన్ సదుపాయం కూడా కల్పించారు.

కాగా, తమ జవాను తప్పిపోయాడని, అతని ఆచూకీ తెలియజేయాల్సిందిగా చైనా సైన్యం నుంచి తమకు సమాచారం అందిందని భారత సైనిక ప్రతినిధులు వెల్లడించారు. లాంఛనాలు పూర్తయిన పిమ్మట అతడిని చుషుల్-మోల్డో సమావేశ ప్రాంతం వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అప్పగిస్తామని తెలిపారు.
PLA Soldier
China
India
Army
LAC
Ladakh

More Telugu News