Sonia Gandhi: అత్యంత క్లిష్ట దశలో మన ప్రజాస్వామ్యం: సోనియా గాంధీ

Sonia Mocks Modi on Democracy

  • కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన సోనియా
  • హరిత విప్లవం నిర్వీర్యం చేసేందుకు కుట్ర
  • మోదీ సర్కారుపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ అధినేత్రి

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. భారత ప్రజాస్వామ్యం అత్యంత సంక్లిష్ట దశలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ చార్జ్ లతో ఓ సమావేశాన్ని నిర్వహించిన ఆమె, హరిత విప్లవంతో సాధించిన ఫలితాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు.

కరోనా వైరస్, ఆర్థిక మాంద్యం, ఎస్సీ, ఎస్టీలపై దాడులు తదితరాలను ప్రస్తావించిన ఆమె, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని అన్నారు. ఎన్డీయే సర్కారు తీరుపై విరుచుకుపడుతూ, ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్ట సవరణలు కోట్లాది మంది రైతులు, కౌలుదారులు, కూలీల జీవితాల్లో మరణ శాసనాల వంటివేనని అన్నారు. ఈ పరిస్థితుల్లో కుట్రలను ఛేదించేందుకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాల్సి వుందని అన్నారు. కేంద్రం కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరించిన ఆమె, కరోనా విజృంభణకు ప్రభుత్వ అసమర్థతే కారణమని అన్నారు.

21 రోజుల్లో కరోనాను ఓడిస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించిన సోనియా గాంధీ, దళితులపై అరాచకాలు పెచ్చు మీరాయని, బాధితుల గొంతులను నొక్కేయడమే కొత్త రాజధర్మంగా మారిందని విమర్శల వర్షం కురిపించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంటే, బాధ్యతగల ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇండియాలో యువతకు ఉద్యోగాలు లేవని, దాదాపు 14 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారని, చిన్న, మధ్య తరహా కంపెనీలు కుదేలయ్యాయని, వాటిని పరిరక్షించేందుకు కనీస చర్యలను కూడా తీసుకోవడం లేదని మండిపడ్డారు.

Sonia Gandhi
Narendra Modi
Democracy
  • Loading...

More Telugu News